హైదరాబాద్: తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కారణమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నుంచి ఉద్యోగాల వరకు అన్నిటినీ గాలికొదిలేశారని దుయ్యబట్టారు. బిసిలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకరావాలనే ఆలోచన పదేళ్లలో కెసిఆర్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షమే కాదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా కెసిఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎస్ సి వర్గీకరణ గురించి పట్టించుకోలేదని, మంద కృష్ణ మాదిగను రెండు సార్లు జైల్లో పెట్టారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను పూర్తి చేస్తున్నామని అద్దంకి తెలియజేశారు.
గత పది సంవత్సరాలు కెసిఆర్ ప్రభుత్వం ఇండ్లు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అడిగారు. కెసిఆర్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు ఫస్ట్ తారీఖును జీతాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ బతికి ఉండడం అనేది విడ్డూరమని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనే పదం తొలగించిన తరువాత తెలంగాణ గురించి ఎలా మాట్లాడుతారని అద్దంకి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చిందని , అభివృద్ధి కూడా చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజస్వామ్య ప్రభుత్వం ఉందని, ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్నాయని, విమర్శించే వాళ్లు విమర్శలు చేయడంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటుందన్నారు.