సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో బిఆర్‌ఎస్, బిజెపి సోషల్ మీడియాలు శునకానందం పొందుతున్నాయని, వారు చేసే అబద్దపు ప్రచారాల వల్ల ఎటువంటి నష్టం ఉండదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హెచ్‌సియూ భూముల అంశంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంపై ట్విట్టర్ వేదికగా అద్దంకి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా బిజెపి, బిఆర్‌ఎస్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌సియూ విషయంలో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించింది అయినా సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించిన కొన్ని అంశాల్లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టే ఇచ్చిందని ఆయన తెలిపారు.
దీనిపై పింక్ లోటస్ మీడియా, బిఆర్‌ఎస్, బిజెపిలు పండుగ చేసుకుంటున్నాయన్నారు. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం వల్ల వారు శునకానందం పొందడం తప్ప మరేమి ఉండదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాలు అన్ని బుమరాంగ్ అవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ తప్పు చేయదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగు వేస్తారని ఆయన తెలిపారు. నాటి సిఎంలు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి మొదలు ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి వరకు అందరూ కూడా కోర్టులు, చట్టాలకు లోబడే ప్రైవేటు వ్యక్తుల నుంచి 400 ఎకరాలను కాపాడారని, మధ్యలో వచ్చిన బిఆర్‌ఎస్ ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.