ప్రధాని మోడీ డైరెక్షన్‌లోనే బిఆర్‌ఎస్ నడుచుకుంటుందని దీంతో ఆ పార్టీ స్థాయి దిగజారిపోయిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఆల్ పార్టీల ఎంపిల మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలపై ఫైర్ అవుతూ శనివారం ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. అఖిలపక్ష ఎంపిల మీటింగ్‌కు రాకుండా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మీద ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల వ్యవహారం చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని బిజెపి, బిఆర్‌ఎస్‌లు డిమాండ్ చేశాయని వారి డిమాండ్ మేరకు
ఈ సమావేశాన్ని నిర్వహిస్తే ఆయా పార్టీల ఎంపిలు సమావేశానికి రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై బిజెపి, బిఆర్‌ఎస్‌లకు చిత్తశుద్ధి లేదన్నారు. కెసిఆర్ ప్రతిపక్ష పాత్ర వదిలేసి ఔట్ సోర్సింగ్‌లో అల్లునికి, కొడుక్కి ఈ పాత్ర ఇచ్చారని ఆయన సెటైర్లు వేశారు. రెండు పార్టీల డ్రామాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సమావేశాన్ని ఎందుకు బైకాట్ చేశారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని ఆయన ఆరోపించారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో బిజెపి, బిఆర్‌ఎస్‌లకు మింగుడు పడటం లేదన్నారు. బిజెపి చేసే డ్రామాను బిఆర్‌ఎస్ వేస్తుందన్నారు. రెండు పార్టీల నాయకులు జలసీతో రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.