కొండపూర్ జిల్లాఆసుప్రతిలో అదనంగా 100 పడకల ఫ్లోర్ ప్రారంభిస్తూ మంత్రి హరీశ్‌రావు ప్రకటన
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 అదనపు పడకల ప్లోర్ ప్రారంభం
రానున్న రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
మంత్రులు తన్నీరు హరీష్‌రావు, సబితాంద్రారెడ్డి వెల్లడి
మన తెలంగాణ/మాదాపూర్ : కరోనా సమయం లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా పడకలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఆర్థిక, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో రహేజా కార్ప్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 100పడకల అంతస్థు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, వైద్యా ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలకు డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో మహేజా కార్ప్ ముం దుకు వచ్చి కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కొవిడ్ సమయంలో హైదరాబాద్‌లో 1300 పడకలను అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిఎస్‌ఐఆర్‌లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 జిల్లాలో 6000 పడకలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో 27వేల పడకలు ఉన్నాయన్నారు. 154 కోట్లతో 900లకుపైగా ఐసియు బెడ్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డయాలసిస్ యూనిట్‌ల పెంపునకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కెసిఆర్ కిట్‌లు వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులో 52శాతం డెలివరీలు పెరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
కార్పొరేటర్‌లు తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. రెండు మూడు సార్లు ఇంటికి వెళ్లి ఆరా తీయాలన్నారు. వ్యాక్సినేషన్ 100శాతం జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహ ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. 3.93 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేస్తామన్నారు. రోజు సుమారు 3.5 నుండి 4లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇస్తున్నామన్నారు. మైండ్ స్సేప్ సిఈఓకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, మాదాపూర్, మియాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.