హైదరాబాద్: బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేయడంతో రూ.2 వేల కోట్లు అదనపు భారం తెలంగాణపై పడిందని విద్యుత్ అధికారి రఘు తెలిపారు. బిఆర్‌ఎకె భవన్‌లో భద్రాద్రి, యదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. కమిషన్‌కు విద్యుత్ అధికారి రఘు వివరాలు అందించారు. కమిషన్ కార్యాలయానికి టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా వచ్చారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయు చేసుకుందని, ఛత్తీస్‌గఢ్ డిస్కంలతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం డిస్కంలు పిపిఎ చేసుకున్నాయని, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పిపిఎలకు ఇంతవరకు ఆమోదం లభించలేదని రఘు పేర్కొన్నారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నామినేషన్ పద్ధతిలో బిహెచ్‌ఎల్‌కు అప్పగించారని, కాంపిటేటివ్ బిడ్డింగ్ వెళ్తే ఆలస్యం అవుతుందని, నామినేషన్ పద్ధతిలో బిహెచ్‌ఇఎల్‌కు ఇచ్చారని, భద్రాద్రి పవర్‌ప్లాంట్‌లో ఇప్పటికే చాలా సమస్యలు వస్తున్నాయని, భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో నాణ్యత లేని యంత్రాలు ఉపయోగించారని, భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను గోదావరి ఒడ్డున నిర్మించడంతో గోదావరి వరదలు వచ్చి ప్రతీసారి ప్లాంట్ మునిగిపోతుందన్నారు. సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. బొగ్గు గనులకు 280 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని, బొగ్గు గనులకు దూరంగా పెట్టడంతో రవాణా ఛార్జీలు పెరుగుతాయన్నారు.