హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా కోసం అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సుమారుగా 800 రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. ఈ మహాకుంభమేళా 2025 సంవత్సరంలో జరుగనుండగా భారతీయ రైల్వే ముందస్తుగానే దీనికోసం సన్నాహాలు ప్రారంభించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ మహాకుంభానికి ఉత్తర మధ్య రైల్వే నోడల్‌గా మారనుంది. ప్రయాగ్‌రాజ్‌లోని నార్తర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే సైతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనుంది.
15 కోట్ల మంది భక్తులు
2025లో జరిగే కుంభమేళాకు దాదాపు 15కోట్ల మందికిపైగా భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఎన్సీఆర్, ఎన్సీఆర్, ఎన్‌ఆర్ తొమ్మిది స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి. రూ.837 కోట్ల బడ్జెట్‌తో ఆర్‌ఓబీ, ఆర్యూబీలు సైతం నిర్మించనున్నారు. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. స్టేషన్ ప్రాంగణం లోపల, బయట పర్యావరణాన్ని పరిశీలించనున్నారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు ఢిల్లీ కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటల పాటు రైళ్లను తనిఖీ చేయనున్నారు. రైళ్లు, ప్లాట్‌ఫాంలు, బయటి స్టేషన్లలో రద్దీని అంచనా వేయడానికి ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమిస్తున్నారు. ఈ బృందం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే నివేదికలను పంపుతుంది. 2019 కుంభమేళా సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగుల అనుభవాన్ని సైతం వినియోగించుకోనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు బస చేసేందుకు వివిధ రంగుల షెడ్లను ఏర్పాటు చేయనున్నారు.
ఫేస్ రికగ్నిషన్.. సిసిటివి కెమెరాలు..
దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ సిసిటివి కెమెరాలను అమర్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ముందుగా ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని ప్రయాగ్‌రాజ్ జంక్షన్ స్టేషన్ నుంచి ప్రారంభంకానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ ఉపయోగపడనుంది. ‘ఫేస్ రికగ్నిషన్’ టెక్నాలజీతో ఈ కెమెరాలను అమర్చిన తర్వాత, నేరస్తులను సులభంగా గుర్తించవచ్చు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ఇతర రైల్వే స్టేషన్లలో అమర్చిన ఈ హైటెక్ టెక్నాలజీ కెమెరాలతో పాటు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఈ కంప్యూటర్లలో అమర్చనున్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టం సాయంతో ముఖాన్ని దాచడంతో పాటు మారువేషంలో రైల్వే స్టేషన్‌లోకి వెళ్లినా నిందితులు, నేరస్తులను సులభంగా పట్టుకునేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.