Thursday, January 23, 2025

మోడీకి సేవ చేయడంలో మమత బిజీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి), కాంగ్రెస్ మధ్య లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు చర్చలకు విఘాతం తగిలింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అద్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి గురువారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీకి సేవ చేయడంలో మమత బిజీగా ఉన్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపాయి. కాంగ్రెస్‌తో పొత్తు ఉండకూడదనే మమత కోరుకుంటున్నారని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీచేయగలదని ఆయన స్పష్టం చేశారు. తాము బిచ్చం అడగడం లేదని, తమతో పొత్తును మమత స్వయంగా కోరుకున్నారని ఆయన చెప్పారు. మమత దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని, తాము సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేయగలమని ఆయన చెప్పారు.

ప్రధాని మోడీకి సేవ చేయడంలో బిజీగా ఉన్న మమతకు తమతో పొత్తు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఒప్పందం కింద రెండు స్థానాలు కేటాయించాలని టిఎంసి భావిస్తున్నట్లు వచ్చిన వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చౌదరి నుంచి ఈ ఘాటు విమర్శలు వెలువడ్డాయి. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తామే సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకుంటామని మమత భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకంపై అవగాహన ఏర్పడుతుందని టిఎంసి చెబుతోంది. ఇండియా కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను తామే సూచించామని టిఎంసి వర్గాలు చెబుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్‌కు తాము వ్యతిరేకం కాదని, కాని కన్వీనర్‌గా ఖర్గే ఉంటేనే మెరుగైన ప్రభావం చూపగలమన్నది తమ పార్టీ అభిప్రాయమని వారు చెప్పారు.

దళిత వర్గానికి చెందిన ఖర్గే 58 లోక్‌సభ స్థానాలలో తన ప్రభావం చూపగలరని తాము విశ్వసిస్తున్నామని వారు తెలిపారు. కాగా..డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాట్లు సాధ్యమైనంత త్వరలో ముగించాలని పార్టీలు నిర్ణయించాయి. 2023 డిసెంబర్ 31 కల్లా సీట్ల సర్దుబాటు వివరాలు ఖరారు చేయాలని టిఎంసి కోరింది. గడువు ముగిసినప్పటికీ కూటమి పార్టీల మధ్య ఇప్పటివరకు ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News