Monday, December 23, 2024

లోక్‌సభలో ప్రతిపక్ష నేత సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిని గురువారం సస్పెండ్ చేశారు. ఆయన సభలో ప్రధాని మోడీపై అదేపనిగా విమర్శలకు దిగడం, మంత్రులను పదేపదే అడ్డుకోవడంపై ఈ వేటేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతపై సస్పెన్షన్ ఆదేశాలు వెలువడటం ఇదే తొలిసారి, కాగా ఈ విషయాన్ని సభా హక్కుల కమిటీకి నివేదిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అవిశ్వాసంపై తీర్మానం చర్చ దశలో సభ్యుడి తీరు ఆగడాల మాదిరిగా మారిందని పేర్కొంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆయన సస్పెన్షన్‌కు తీర్మానం తీసుకువచ్చారు. ఆయన సభా నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేశారని , సభ పట్ల, స్పీకర్ పట్ల అగౌరవం చూపారని , ఆయన దుష్ప్రవర్తనపై సభ నుంచి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఇక హౌస్ కమిటీకి పంపిస్తునట్లు మంత్రి తెలిపారు. హక్కుల కమిటీ నివేదిక వచ్చే వరకూ ఆయనపై సస్పెన్షన్ ఉంటుందని మంత్రి వివరించారు.ఆయన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ మూజువాణితో ఆమోదించింది.

అయితే తాను ఎవరిని నొప్పించలేదని, ఎటువంటి తప్పిదానికి పాల్పడలేదని ఆ తరువాత అధీర్ చౌదరి విలేకరులతో తెలిపారు. చర్చ దశలో ప్రధాని మోడీపై చౌదరి చేసిన కొన్ని వ్యాఖ్యలపై బిజెపి సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకువచ్చారు. తరువాత సభ్యుడి వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలిగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రధాని మోడీ పట్ల ఎంపి వ్యాఖ్యలు గర్హనీయం అని, ఆయన వెంటనే ప్రధానికి క్షమాపణలు చెప్పాల్సి ఉందని బిజెపి సభ్యులు తెలిపారు. కాగా అవిశ్వాస తీర్మానం సభలో వీగిన తరువాత స్పీకర్ మాట్లాడారు. సభలో బిజెపి ఎంపి వీరేంద్ర అవస్థి, కాంగ్రెస్ ఎంపి అధీర్ రంజన్ మాటలు సభా నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపారు. తరువాత వీరేంద్ర తను క్షమాపణ చెపుతున్నట్లు తెలిపి, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలను తాను సహించలేకపోయినట్లు స్పీకర్‌కు తెలియచేసుకున్నారు. ఈ బిజెపి ఎంపి క్షమాపణను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతపై సస్పెన్షన్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News