Monday, December 23, 2024

కవిత్వానికి ఆత్మ

- Advertisement -
- Advertisement -

తుల శ్రీనివాస్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ, ప్రవృత్తిరీత్యా సాహితీ ప్రేమికుడు. పుట్టినూరును మరువకుండా ప్రేమాను బంధాలను విడవకుండా కవిత్వమై నిలిచినోడు. తన తొలి సంపుటి పుస్తకానికి ‘చింతల తొవ్వ ‘అని పేరు పెట్టడంలోనే ఆయన ఔన్నత్యము ఎటువంటిదో అర్థమవుతుంది. ఈ కవితా సంపుటిలో మొత్తం 45 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకత కలిగి ఉంది. ఈ కవిత బాగుంది. అది బాగలేదు అని నిర్ధారించలేం. ఇందులోని కవితలన్నీ అతని ఆకాంక్షలకు, ఆలోచనలకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని కవిత్వం అంతా భావ ప్రయాణం. చింతల తొవ్వ పేరును బట్టి ఆధ్యాత్మిక చింతన కాదు. అది సమాజంలోని మానవ సంబంధాల వంతెన గా పేర్కొనవచ్చు.ఆ పేరు వినగానే, చూడగానే మబ్బు పట్టి వర్షం కురిసినప్పుడు మట్టి వాసన వచ్చినట్లే ఆ కవితల్ని చూడగానే పల్లె వాసన పరిమళిస్తది. ప్రతి కవితాంశంలో తడి నిండిన అక్షర సమూహాలే కనిపిస్తాయి. తడి తడి జీవితం తన్మయం చెంది తాజాగా పలికినప్పుడే కవిత్వం అనేది మనసుకు హత్తుకుంటుంది. జీవితంలోని సంఘటనలను కవి తన ప్రతిభా కవిత్వంలో చూపిస్తాడు. ఎవరి కవిత్వంలో ఏ భావన పండాలన్నా ఆ కవిత్వంలో ఉత్పత్తి అయ్యే రసమే కీలకం.ఇది జీవితం కాచిన కవికే కవిత్వాన్ని వికసింపజేయడం సాధ్యమవుతుంది. జీవితాన్నే కవిత్వ ప్రయాణంగా భావించి కవిత్వంలో సాహిత్య పంటను విస్తారంగా పండిస్తున్న మనలోని కవి తుల శ్రీనివాస్. జీవితాన్ని తన ఎదలో అద్దుకుని, జీవితం చేత దిద్ధపడిన కవి ఇతను. మట్టి పరిమళాలను, పల్లె భావోద్వేగాలను అక్షరాలలో ఒదిగించి కవిత రూపంలో వొంపిన నిమ్మలపు మనిషి తుల శ్రీనివాస్. / ‘చింతల తొవ్వ ‘లోని మొదటి కవిత లోనే…..’/ అక్కడ ప్రతి అమ్మ మది/ పచ్చి పాలకుండే/ ప్రతి అయ్య హృది/ మల్లెపూల చెండే/ ఈ గోడలూ ఆ ఇళ్లను/ విడదీయలేవు
ఈ రేఖలు ఆ మనుషుల్ని విభజింపలేవు ‘ (పురిటి మట్టి ) అంటూ పందిరి తీగల్లా అల్లుకున్న మనుషుల మధ్య ఉన్న బంధాలను, మట్టితో ఉన్న సంబంధాలను తట్టి లేపుతాడు. మనసుల యొక్క గుణగణాలను, విశదీకరిస్తూ మట్టి యొక్క మహిమను కవి ఎంతో అందంగా చిత్రిస్తాడు . తుల శ్రీనివాస్ నిన్న మొన్నటి కవి అయినప్పటికీ, ఊహించని విధంగా బతుకు చిత్రాలను వడ్లను రాసులుగా పోసినట్టు కవితలను కుప్పలుగా పోసి కవిత్వాన్ని ఎంత ఎత్తుకు తీసుకపోవాలో అంత ఎత్తుకు తీసుకపోయి పాఠకుడికి పరిచయం అయ్యాడు . ‘జీవితంలో అనుభవించి, కడుపులో మండిన వాడే, జీవితపు లోతుల్లోకి వెళ్లిన వాడే నిజమైన కవిత్వం రాయగలడు ‘ అన్న విషయం తుల శ్రీనివాస్ విషయంలో మరోసారి రుజువయింది. శ్రీశ్రీ అన్నట్లుగా కవిత్వానికి కాదేది అర్హము అన్న ట్లుగా… తుల శ్రీనివాస్ జీవితంలో చిన్న అంశాన్ని కూడా కవితా వస్తువుగా తీసుకొని సఫలీకృతుడైనట్లు చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగా ‘పిన్నీస్‘ అనే కవితలో (పేజీ నెంబర్ 64) ఇట్లా అంటాడు. / ‘అమ్మ రవిక చినిగినప్పుడు/ అక్క లంగా బొందె తెగినప్పుడు/ మానాన్ని కాపాడి/ దారిద్య్రాన్ని దాచింది ఈ పిన్నీసే’/ బడికెళ్లే వేళ…/ గుండీలూడిన నిక్కరకో/ కుట్లు పిగిలిన చొక్కాకో/ పిన్నిస్ పెట్టి బుగ్గను ముద్దాడి అమ్మ కళ్ళకద్దుకున్న క్షణం/ ఎందుకో.. ఇప్పటికీ/ వెంటాడి గుచ్చుతూనే ఉంది
‘రాలిపోయిన బాల్యస్మతులన్నీ పొరలు పొరలుగా కుట్టుకోవాలనిపిస్తది’ అని. సమర్ధుడైన కవి మామూలు వస్తువును కూడా గుండె లోపల ఎట్ల గుచ్చాలో ఈ కవితను మంచి ఉదాహరణగా చెప్పకనే చెప్పవచ్చు. చిన్న వస్తువు కూడా మానాని ఎట్ల కాపాడిందో, చిన్నప్పుడు శీలాన్ని ఎట్లా దాచిపెట్టిందో కవి ఎంత హృద్యంగా విశదీకరించాడో ఈ కవితను చదివితే అర్థమవుతుంది. ఈ సంకలనానికి ముందుమాట రాసిన ఆచార్య యన్.గోపి గారు తుల లేని కవితలు అంటూ పొగుడుతూ…. శ్రీనివాస రాసిన‘పిన్నిస్‘ కవిత తనకంటే బాగా గొప్పగా రాశాడని కితాబివ్వ డమనేది గొప్ప విషయం. ఈ ఒక్క మాట చాలు శ్రీనివాస్ కవి అని చెప్పడానికి. / అలాగే ‘అనగనగా ఓ సైకిల్’ (పేజీ 88)అనే ఇంకో కవితలో…/ ‘కావంచి తొక్కుతూ/ కాళ్లు సవరించుకునే వేళ…/ జీవితంలో ఎత్తు పొలాలు/ సహజమేనని ఎరక చేస్తూ/ ముందుకు సాగే తత్వజ్ఞాని!! అంటూ సామాన్యుని రథచక్రం సైకిల్ జీవితంలో ఎట్లా ఉపయోగపడిందో, దాన్ని చూసి మనం ఏం నేర్చుకున్నామో, సైకిల్ మన అనుబంధానికి ఎంత ఆధారమో కవి వ్యక్తీకరించడం గొప్ప విషయం.
తెలంగాణ భాష సంస్కృతిని కాపాడుకునే విధంగా కవిత్వాన్ని కార్యంగా మలుచుకుని పాఠకుల అంతరంగాలను అవగాహన చేసుకుని జాగృత పరిచే భావకుడు తుల శ్రీనివాస్. తన అంతరంగంలో దాచుకున్న ఊహ చిత్రాలను కవిత్వంలోకి వొంపుతాడు. ఈ సంపుటిలోని కొన్ని కవితలను మన ఇండ్లలో గోడలకు బొమ్మల్లాగా తగిలించుకునేంత విధంగా ఉంటాయనిడంలో అతిశయోక్తి కాదు. వాస్తవం ఇది. తోటలో సీతాకోకచిలుకల్లాగా పుస్తకంలో మరి కొన్ని కవితలు మనకు దర్శనమిస్తాయి. ‘మట్టి శిల్పం‘ అనే కవితలో ఉత్పత్తి కులాల యొక్క సౌందర్యాన్ని వివరిస్తాడు. కుమ్మరి యొక్క జీవితాన్ని ఏ కరువు పెడతాడు. కుండ యొక్క ప్రాధాన్యత తెలుపుతాడు ఈ విధంగా…/ ‘పచ్చి మట్టికి పురుడుపోసి/ అద్భుతమైన ఆకృతులను చెక్కే/ నీ ముని వేళ్ళ సంస్కారానికి/తనువెల్లా పులకిస్తాను’/ మట్టి ధర్మాన్ని /మనిషి ధర్మంతో ముడిపెట్టిన మహిమ నీది / మావికుండ నుండి అంతిమకుండా (తలగోరు )దాకా మనిషితో పెన వేసుకున్న బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచి ‘ అంటూ మానవ నాగరికతలో ఉత్పత్తి కులాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతూ, మానవ జీవితంలో కుండ అనివార్యమైన విషయాన్ని ఎరుక జేస్తూ, జీవితంలోనుండి కుండను నెట్టివేసిన విషయాన్ని నర్మగర్భంగా విశీకరించాడు. చివరికి మ్యూజియంలోకి చేర్చిన విషాద స్థితిని శ్రీనివాస్ హృద్యంగా చిత్రించాడు. నానాటికి అడుగంటిన కులవృత్తిపై,తీరు తెన్నులపై మనసును కలచి వేసే విధంగా వ్యక్తీకరించాడు. దుర్భరమైన జీవిత విషయాన్ని గంభీరంగా కవిత్వీకరించడంలో శ్రీనివాసుది అంది వేసిన చెయ్యి. కనబడకుండానే కన్నీటి పర్యంతం చేయడంలో ఆయనకు బాగా తెలుసు. ఊరన్న తర్వాత ఉద్వేగం తప్పదు. మనుషున్న తర్వాత అనుబంధాలు తప్పవు.కవి అన్నాక స్పందించక తప్పదు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు అల్లుకున్నట్టే అల్లుకుంటూ అల్లకల్లోలం అవుతున్న రీతిని ఎండగడతాడు. అతడు కవి కదా! ఉన్నతంగా వ్యక్తీకరిస్తాడు. ఉన్నతీకరిస్తాడు. ఏడుస్తాడు ఏడిపిస్తాడు. ఊరిడిస్తాడు. ఇవన్నీ శ్రీనివాసులో దాగి ఉన్న కలలు.
ఒక మాటలో చెప్పాలంటే తుల శ్రీనివాస్ తన కవితలలో కొండంత భావం ఇముడిస్తాడు. మొదటి సంకలనం ద్వారానే తెలుగు కవిత్వంలో ముఖ్యంగా తెలంగాణ కవిత్వంలో ఒక పాయగా పారుతున్నాడు శ్రీనివాస్.‘అమ్మ స్థితి’ చెప్పడానికి శ్రీనివాస్ చేకూర్చిన ఈ కింది వాక్యాలు చాలు…/ ‘ ఒకప్పుడు అమ్మంత ఇల్లు / ఇప్పుడేమో గదంతా అమ్మ‘ (పేజీ 58)/ అమ్మంత ఇల్లు తిరిగేస్తే ఇల్లంత అమ్మ. అది అమ్మ వైభవము, సామ్రాజ్యం. ఎటు చూసినా అమ్మే. అమ్మ విశ్వరూపం. అంతటి ఆకాశమంత అమ్మ గదికే పరిమితం చేయబడింది. అని అమ్మ గురించి పట్టించుకునే నాథుడే లేడని కవి వ్యక్తీకరించాడు.
ప్రపంచీకరణ జరిగిన నేపథ్యంలో.. రైతు యొక్క ప్రధాన రోజుకు తగ్గిపోతుంది. రైతే దేశానికి వెన్నెముక అన్నది ఓనాడు. రైతుల కష్టార్జితాన్ని సర్వనాశనం చేస్తుందీ నాడు. రైతు గురించి కూడా శ్రీనివాస్ కరిగి కన్నీరయ్యాడు. ‘ఒడ్డోరంజెక్కి ఒంపు మిర్రలు సైజేసినంక /ఇర్రంవంటున్న బుర్ధ కాళ్ళు /పగిలి పచ్చెలైన పాదాలు జూస్తే /మా బరువే కాదు /నాయిన దేశం బరువు మోస్తున్నట్టు అనిపించేది. ‘ అంటూ నాయన పడ్డ కష్టాలను తెలిపాడు. శ్రీనివాస్ తన కవిత్వంలో అలాయ్ బలాయితో అలరిస్తాడు. పెద్దగట్టు జాతరని మైమరిపిస్తాడు. మట్టి మురిసిపోయే కవిత్వం. నుడికారాలు, పదబంధాలూ ప్రతి కవితలో సాక్షాత్కరిస్తాయి. కొత్త కొత్తగా కవితా దోస్తులవుతాయి.
అదేవిధంగా ‘గుప్పెడంత జీవితం‘ కవిత (పేజీ 19) లో విశ్వం పుట్టుక గురించి, మనిషి అహంకారం గురించి ఈ విధంగా వర్ణిస్తాడు. / ‘ఎన్నో మహాయుగాలు యాతన పడి/ ఎన్ని మహాప్రళయాలు దాటుకుని/ విశ్వం తన ఆకృతి చెక్కుకుందో…‘ అంటూ శ్రీనివాస్ విశ్వం గురించి తెలియజేస్తూ సహజ సిద్ధంగా ఏర్పడ్డ విధానాన్ని తెలియజేశాడు.
అటువంటి ప్రపంచంలో మనిషి తన నైజాన్ని ఎట్ల ప్రదర్శిస్తున్నాడో స్పష్టపరిచాడు./ ‘సృష్టికి ప్రతిసృష్టి నీకే సాధ్యమంటూ../ ఎందుకు నీకీ మిడిసిపాటు!/ గట్టిగా రాస్తే నీ చరిత్ర సమస్తం/ ఒక్కటంటే ఒక్క వాక్యం కాదు!!’/ ‘నీటి బుడగ లాంటి జీవితం/ పగలకముందే…/ నీవైన ఆనవాలు కొన్ని/ ఈ నెల పై చెక్కు/ మట్టిలో కలిశాక కూడామనిషివై మిగులుతావు…. ‘అంటూ మనిషి యొక్క ఇజాన్ని, నైజాన్ని, అహంకారాన్ని తూర్పారబడతాడు. మనిషిగా పుట్టినందుకు మనిషి తనంతో బతుకమంటాడు కవి. మనిషి సచ్చిపోయినంక మంచితనమే చరిత్రలో మిగుల్తది అంటాడు. ఇంకోచోట ‘తీయటి జ్ఞాపక‘మనే కవితలో సవుడు మిద్దె ఇల్లు గురించి హృదయ విధారకంగా, కళ్ళు చెమ్మగిల్లేలా ఈ విధంగా వర్ణిస్తాడు.
‘పొద్దూకాల సుట్టమై వచ్చిన జల్లు/ చిల్లుల దుప్పటి కప్పుకున్న/ సౌడు మిద్దె సంసారాన్ని/ సిన్నతనం చేస్తుంటే…./ యీ కొంప నాశనం గాను/ ఎప్పటికీ ఈ బాధలు తప్పవాయే/ అని అమ్మ శోకాలు పెడుతుంటే/ గుబులెక్కిన నా గుండె/ కొండ లెక్క ఉరిమేది’/ పెద్ద కర్రతో అన్న కింది నుండి/ మిద్దెను మద్దిల దరువేస్తుంటే…/ చీకటి వేదికపై చినుకులు/ పూంజితం ఆడుతుంటే…./ ‘ఇప్పుడు అక్కడే తియ్యని జ్ఞాపకాలని కాసే మామిడి చెట్టు/ మా నాన్నల నిలబడి ఉంది….’ అంటూ వర్షం వచ్చినప్పుడు ఇల్లు కురుస్తుంటే పడిన బాధలను ఏ కరువు పెట్టాడు.ఆర్థిక పరిస్థితులను చెప్పకనే చెప్పాడు. అదేవిధంగా ‘ఓ మనిషి కావాలిప్పుడు’ అనే మరో కవితలో పల్లె ప్రజల యొక్క గుణగణాలను హృదయాంతరాలలో నుంచి ఇట్లా వ్యక్తపరిచాడు./ ‘తిన్నావా నాయనా.. ఏం కూర…/ ఏం పని చేస్తుండ్రు బిడ్డా…’/ అనే మాటలు అల్లుకుంటూ/ మల్లె పందిరయ్యేటోళ్లు…./ అద్దమ్మ రాత్రి దాకా/ దుఃఖపు చీకట్లనల్లిస్తూ/ కష్టాల గూట్లో/ కన్నీటి దీపాలయ్యేటోళ్ళు….’ అంటూ ఒకప్పుడు పల్లె వాసులూ ఎంత నిజాయితీగా, ఆప్యాయంగా, ప్రేమతో ఉండేవారో తన జ్ఞాపకాలని తుల శ్రీనివాస్ ఎరుకజేశాడు. కవిగా, రచయితగా రాణిస్తూనే ఉపాధ్యాయుడిగా తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూన్నాడు. తొట్ట తొలుతనే ‘చింతల తొవ్వ‘ సంపుటితో సాహితీ ప్రపంచానికి పరిచయమయ్యాడు. శ్రీనివాస్ ఎంతో మృదుస్వభావి. ఆయన రాసిన ఇందులోని కవితలన్నీ మంచివే. కవిత్వం లేకుండా ఏ వాక్యము లేదు. అంతటి బలమైన కవి. కవిత వస్తువుల్లోకి దూరి కరిగి కవితగా మారి అద్భుతమైన కవిత్వాన్ని ఆవిష్కరించాడు. ఇది అందరి నుంచి కాదు. ఇది ఒక రకమైన మార్మికమైన ధ్యానస్థితి.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
94415 61655

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News