పర్యావరణహితంగా పంటల సాగు
ఖర్చులు తగ్గిస్తేనే లాభదాయకం
రైతు స్వరాజ్యవేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు చట్టాలను రద్దు చేసి, రాష్ట్రానికో సమగ్ర వ్యవసాయ విధానం ఉండేలా కృషి జరగాలని రైతు స్వరాజ్య వేదిక అభిప్రాయ పడింది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్రాల అసెంబ్లీలు తమ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్చులు చేర్పులు చేసుకోవాలని వేదిక సూచించింది.కేంద్ర చట్టాలకు ప్రత్యామ్నాయంగా రైతు స్వరాజ్య వేదిక పలు సూచనలతో ప్రకటన విడుదల చేసింది.రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల సహజ వనరుల అందుబాటు, వాటి స్వభావాన్ని బట్టి ,పంటల వైవిధ్యాన్ని బట్టి, రాష్ట్ర బడ్జెట్‌కు ఉండే పరిమితులను బట్టి, అన్నింటికీ మించి స్ధానిక వాతావరణాన్ని బట్టి నిర్దుష్టమైన చర్చలు జరగాలి.రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ కుటుంబాలకోసం శాశ్వత ప్రాతిపదికన ఒక ఆదాయ కమీషన్ ఉండాలి.
ఈ కమీషన్ అధ్వర్యంలోనే రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఖర్చులపై ధరల నిర్ణాయక కమీషన్ పనిచేయాలి.మండల ,జిల్లా స్థాయిల్లో పంటల ప్రణాళికలు రూపొందాలి. స్థానిక ఉత్పత్తి,ప్రాసెసింగ్, నిల్వ,పంపిణీ నూతన ప్రణాళికలకు ప్రాతిపదిక కావాలి.స్వామినాధన్ కమీషన్ సూచించిన సిఫార్సులు అమల్లోకి రావాలి. రాష్ట్రంలో పండే అన్ని పంటలతో పాటు ,పాలు ,మాంసం,చేపలు, గడ్లతో సహా గ్రామీణ ఉత్పత్తులకు శాస్త్రీయ పద్దతిలో సమగ్ర ఉత్పత్తి ఖర్చులను లెక్కవేసి ,స్వామినాధన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు 50శాతం కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరలకంటే తక్కువగా ఎవరూ కొనకుండా మార్కెటింగ్ చట్టాల్లో సరవణలు చేయాలి. రైతు వేదికలను వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి దారులకు నిపుణత పెంచే కేంద్రాలుగా రూపొందించాలి. గ్రామ స్ధాయిలో వాస్తవ సాగుదారులను గుర్తించాలి.
కోతులు,అడవి పందులు ,నెమళ్లు వంటి అటవీ జంతువుల వల్ల జరిగే పంట నష్టాలను కూడ బీమా పరిధిలొకి చేర్చాలి. గ్రామీణ మత్స కారులు,పశుపోషకులు, గీత కార్మికుల జీవనోపాధి రక్షణ ,ఆదాయాల మెరుగుదల కోసం మరిన్ని పధకాలు అమలు చేయాలి. పర్యావరణ హితమైన వ్యవసాయ ఉత్పత్తి పద్దతులను ప్రోత్సహించాలి. రాష్ట్రస్థాయిలోనే సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.హానికరమైన కలుపు ,పురుగు మందులను నిషేధించాలి. రైతు బీమా పధకాన్ని విస్తరించి మొత్తం గ్రామీణ కుటుంబాలను ఈ పధకం పరిధిలోకి తీసుకురావాలి. పధకం అమలుకు వయోపరిమితిని 75ఏళ్లకు పెంచి కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించాలి. వ్యవసాయ కుటుంబాలకు ఇచ్చే పెన్షన్‌ను కనీసం రూ.3వేలకు పెంచాలి. ఈ అంశాలన్నింటినీ జాతీయ రైతు సంఘాలు తమ డిమాండ్లలో చేర్చాలి.
కేవలం మద్దతు ధరల పెంపు మాత్రమే రైతుకుటుంబాలకు చెందిన మొత్తం సమస్యలను పరిష్కరించలేదు. వ్యవసాయ ఉత్పత్తిలో ఖర్చులు తగ్గించుకోకుండా వ్యవసాయం , ఇతర గ్రామీణ ఉత్పత్తులు లాభదాయకం కావు. ప్రస్తుత సమయంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత సాధించడం ,మొత్తం రైతు ఉద్యమాల్లోనే మొదటి మొట్టుగా ఉపయోగపనుంది. మిగిలిన హక్కుల సాధనకు అది ఉద్యమాన్ని మరింత ముందుకు నెడుతుంది. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి రైతు,గ్రామీణ కుంటుంబాలకు ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ అంశాలన్నింటినీ చర్చించి మరింత మెరుగైన డిమాండ్లతో ముందుకు సాగాలని రైతు స్వరాజ్య వేదిక పేర్కొంది.