మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు భద్రాద్రి ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి 23 వరకు ఈ అధ్యయనోత్సవాలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అధ్యయనోత్సవాల పోస్టర్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఏకాదశి అధ్యయనోత్సవాలకు రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు, వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని మంత్రికి అందచేశారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రి సూచించారు. భక్తులు కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Adhyayanotsavam to start in Bhadrachalam from Jan 3rd