Wednesday, January 22, 2025

ఆదిలాబాదు ముచ్చట్ల గుమ్మి

- Advertisement -
- Advertisement -

పరాయి భాషాహోరుగాలి లో బతుకుతున్న మనం ,కనీసం భావితరాలవారికైన మన భాష పదాల సొగసులు, అక్షరాలపెట్టెలో భద్రపరిచి ఉంచాలన్న తపనతో చేయబడిందే ఈఅక్షరకృషి, విస్తృతమైన పరిధిలోని చూపు యొక్క పలచదనం, పరిమితమైన పరిధి లోని చూపు యొక్క స్పష్టత తెలిసిన భద్రయ్య ఈ బృహత్తర క్రతువుకుకంకణం కట్టుకున్నారు అనిపిస్తుంది.

అడవుల జిల్లా ఆదిలాబాద్ లో జరిగిన అక్షర క్రతువు అది, ఆ ప్రాంతం తలవగానే యాదికి వచ్చేది, కొమురం భీం పోరాటజ్వాల, ఇంద్రవెల్లి రక్తతర్పణం, అమాయకపు గోండుగిరిజన జన జీవితాల బలిదానాలు, అక్షర జ్ఞానానికి అల్లంతదూరాన బ్రతికే అభాగ్య భావి పౌరులు, అలాంటి అసౌకర్యాల నేలపై అవతరించిన ఈ కాలపు ‘మనవ్యాసుడు మడిపల్లి భద్రయ్య‘(17/-01-/1945,18-/09-/2021) ఉపాధ్యాయ వృత్తి రీత్యా జిల్లా రాష్ట్ర జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎదిగి ఎందరో అడవిబిడ్డలను అగ్ర స్థానాల్లో నిలిపిన ఆదర్శ అధ్యాపకుడతడు, ప్రవృత్తిగా అక్షర సేద్యం చేస్తూ కవి, గాయకుడు, నటుడుగా, అవిశ్రాంతంగా ఐదు దశాబ్దాలపాటు అలుపెరగని సాహితీ కృషి చేసిన ఆదర్శ సాహితీమూర్తి ఆయన.
అతని సాహితీ కృషి అంతా ఒక ఎత్తు అయితే తన జీవిత చరమాంకంలో స్వీయ అక్షర, ఆర్థిక, కృషితో వెలువరించుకున్న బృహత్తర పదకోశం ‘మన భాష మన యాస‘ ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ‘వ్యవహారిక భాష పదకోశం‘
దీని ఉపయోగ పరిధి కేవలం ఒక్క జిల్లావాసుల కే పరిమితం అని అనిపించిన భద్రయ్య గారు ఈ బృహత్తర కృషి వెనుక మరో పార్శ్వం దాగి ఉంది,
ఆధునిక ప్రపంచీకరణ అనబడే ‘అదృశ్య ఆయుధం‘ ద్వారా మనదైన అచ్చమైన స్వచ్ఛమైన స్థానిక మాటలు వ్యవహారిక భాష పదాలు అదృశ్యం చేయబడుతూ….
పరాయి భాషాహోరుగాలి లో బతుకుతున్న మనం ,కనీసం భావితరాలవారికైన మన భాష పదాలసొగసులు, అక్షరాలపెట్టెలో భద్రపరిచి ఉంచాలన్న తపనతో చేయబడిందే ఈఅక్షరకృషి,
విస్తృతమైన పరిధిలోని చూపు యొక్క పలచదనం,
పరిమితమైన పరిధి లోని చూపు యొక్క స్పష్టత తెలిసిన భద్రయ్య ఈ బృహత్తర క్రతువుకుకంకణం కట్టుకున్నారు అనిపిస్తుంది.
తొలి తెలంగాణ పదకోశ కర్త డాక్టర్ నలిమెల భాస్కర్ ప్రేరణతో, జన్మ భూమిపై గల ప్రేమతో, ఉద్యోగ విరమణ అనంతరం తన పూర్వ పర్యటనలు, పరిశీలనలు ద్వారా అందిన అనుభవం, సాయంతో సుమారు పుష్కరకాలం పాటు ఆదిలాబాద్ జిల్లాలోని 52 మండలాలు, 160కి పైగా గ్రామాలు సాయంతో పర్యటించి చేసిన పరిశోధన కృషి ఫలితమే ఈ మన భాష మన యాస.
సాధారణంగా హిందీ, మరాఠీ, భాష ప్రభావాల సమ్మేళనంగా ఉండే ఆదిలాబాద్ జిల్లా తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైన లయ, సొగసుసులు, దాగి ఉంటాయి.
ఇక్కడి గ్రామీణ జానపద, పురాతన, భాష పదాల వెనుక ఎంతో చారిత్రక, స్థానిక, కథనాలు దాగి ఉంటాయి.అలాంటి వాటన్నిటినీ ఒడిసి పట్టుకోవడంలో భద్రయ్య సఫలీకృతులయ్యారు, కారణం తను జనంలో జనంగా కలిసిపోయి పనిచేసి పర్యటించడమే..!
నందిని సిద్ధారెడ్డి ఈ పుస్తకం గురించి రాస్తూ ‘ఇది ప్రజల నాలుకల పదసంపద‘ అన్న మాటలో అక్షర సత్యం ఉంది,నిజమే ఇది అచ్చంగా జనం పలుకుబడుల పదకోశం, అలనాడు తయారుచేసిన ప్రామాణికం అనబడే భాషా పదకోశాల్లో లేని సమాచారం ఇందులో పుష్కలంగా లభ్యమవుతుంది, రచయిత తన వినమ్రత ప్రకటిస్తూ…‘ఇది సమగ్రం అని చెప్పలేను ఇంకెన్నో మాటలు మిగిలే ఉంటాయి‘ అని అనడం ద్వారా భావి పరిశోధకులు దృష్టి సారించి విశ్వవిద్యాలయాల స్థాయిలో, స్థానిక భాషలపై పరిశోధనలు చేసి తీరాల్సిన అవసరంవుంది అని చాటి చెబుతోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ తెలుగు భాషా సాహిత్యాల్లో జరిగిన అనేక నూతన ఆవిష్కరణల్లో ఒకటి ‘మడిపల్లి భద్రయ్య గారి ఈ స్థానిక భాషా పదకోశం‘తెలుగు వర్ణమాల ప్రకారం ఆకారాదిక్రమంలో పొందుపర్చబడ్డ ఈపదకోశం నిండా అన్ని వాడుకభాషామాటలే…!!ఆంగ్లం, హిందీ, మరాఠీ, వంటి అన్యభాషా సమ్మేళనంతో ఉండే ఈ ఆదిలాబాద్ పల్లె తెలుగు పదాలకు అర్థవివరణ కూడా అక్కడి అచ్చమైన స్థానిక భాష యాసలోనే ఇవ్వడం ఇందులోని విశేషం.సుమారు 10 వేలకు పైగా పదాలు గల ఈ పదకోశంలో పదానికి అర్థంతో పాటు వాక్య ప్రయోగం, కూడా వివరించడం ఇందులోని మరో విశేషంగా చెప్పవచ్చు.ఇక ఇందులో కొన్ని ఆసక్తికరమైన పదాలను కూడా గమనించవచ్చు,సాధారణంగా ‘ పుట్టెడు‘ అనేది ధాన్యపు కొలతలకు సంబంధించిన పదం. కానీ ఆదిలాబాద్లో దీనినే ధాన్యం కోలతతో పాటు పెంపుడు జంతువుల సంఖ్య తెలపడం కోసం కూడా వాడతారు అనే విషయం ‘మాకు రెండు పుట్ల మేకలు పుట్టెడు గొర్లు ఉన్నాయి అనే వాక్యం, ద్వారా వెల్లడించారు, ధాన్యం కొలతలో పుట్టెడు అంటే ఎనిమిది పల్లాలు అని, జంతువుల సంఖ్యలో పుట్టెడు అంటే పది జంతువుల అని వివరించారు,
మనం వాడే వాడుక పదాలు కూడా ప్రాంతాన్ని బట్టి పేర్లు మారిపోతుంటాయి, దానికి కారణం ఆయా ప్రాంతపు భాషా ప్రభావమే, ఖర్జూర పండ్ల ని ఆదిలాబాద్ లో ‘ఉచ్చడి పండ్లు‘ అంటారు అనే విషయం ఈ పదకోశం వల్ల తెలుస్తుంది, ఇలా ఎన్నో కొత్త కొత్త పదాలు ఇందులో కొలువై ఉన్నాయి, ముందే అనుకున్నట్టు ప్రతి పదంపై పొరుగు భాష ప్రభావం శతశాతం ఉంటుందికనుక ఈ పదకోశంలో కొన్ని పదాలకే కాక ప్రతి పదంకు ముందు ఆయా పొరుగు భాష పదాల వివరణ ఇచ్చి ఉంటే మరి కాస్త ఉపయుక్తమైన అదనపు సమాచారం అందిఉండేది.
ఈ పదకోశకర్త భద్రయ్య గారి ప్రధాన దృష్టి తన ప్రాంతంలో ప్రస్తుతం వాడుకలోగల స్థానిక భాష పదాలన్నిటిని ఒడిసిపట్టి ఒక చోట రాశి పోసి భావితరాల కోసంభద్రపరచాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా సాగిందితప్ప. నిఘంటు నిర్మాణంలో పాటించాల్సిన సంపూర్ణ శాస్త్రీయ పద్ధతుల వైపు దృష్టి పెట్టలేదు.
నిఘంటు నిర్మాణంకు కావలసిన ప్రామాణిక పద్ధతులను పక్కనపెట్టి, సామాన్యులకు కావలసిన సమాచారం అందించడమే ముఖ్యం, అన్న చందంగా దీని నిర్మాణ శైలి కొనసాగింది.‘అక్కర‘తో మొదలై ‘క్షవరం‘ తో ముగిసిన ఈ పదకోశం సుమారు వేయి పేజీలతో అలంకరించబడింది.వీటి సేకరణకు ఎంత శ్రమ పడ్డారో .. పుస్తక రూపంలో తీసుకురావడంకు అంతక రెట్టింపు ఆర్థిక కష్టం కూడాపడి, తనలక్ష్య సిద్ధికోసం, తన సహచరుల బంధుమిత్రుల, ఆత్మీయుల, ఆర్థికసాయంతో పాటు, తన తల్లి ‘మడిపల్లి గంగమ్మ‘ అందించిన ఆర్థిక సాయం కూడా స్వీకరించి, ఆర్థిక భారంతో ఈ బృహత్ గ్రంథాన్ని ప్రచురించి పాఠకులకు అందించారు.ఈ అక్షర శ్రామికుడి కృషికి సంపూర్ణ ఫలితం రావాలంటే, ప్రతి ప్రాంతంలో స్థానిక పదాలతో కూడిన పదకోశాలు రావాలి. విశ్వవిద్యాలయాలో, అకాడమీలో, చేయాల్సిన పనిని భద్రయ్య గారు తన శక్తికి మించిన శ్రమతో పూర్తిచేయడం ఎంతగానో అభినందించి ఆచరించదగ్గ విషయం.

డా: అమ్మిన శ్రీనివాసరాజు
7729883223

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News