Wednesday, January 22, 2025

సూర్యుడిపై ‘ఇస్రో’ టార్గెట్… త్వరలోనే ఆదిత్య ఎల్1ప్రయోగం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : జాబిల్లిపై పరిశోధనకు చంద్రయాన్3 వ్యోమనౌకను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి సిద్ధమౌతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. సెప్టెంబర్ మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ సి57 వాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఆదిత్యఎల్1 ఉపగ్రహ చిత్రాలను ఇస్రో సోమవారం సోషల్ మీడియాలో పంచుకుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా,ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.

Also Read: తెలంగాణ నంబర్ వన్… భూములు ఎందుకు అమ్ముతున్నారు: కిషన్ రెడ్డి

ఆదిత్య ఎల్ 1 విశేషాలు
సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఈ శాటిలైట్ 1500 కిలోల బరువు ఉంటుంది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు.
భూమినుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం లోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1)చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ కక్ష లోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.

ఆదిత్య ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధాన మైన “విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ ( విఈఎల్‌సి)తోపాటు సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ , ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ , హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు.

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News