Monday, December 23, 2024

ఆదివాసీల తొలి డాక్యుమెంటేరియన్

- Advertisement -
- Advertisement -

విశ్వవిఖ్యాత మానవ విజ్ఞానవేత్త హైమండార్ప్ గురించి తెలియని వారుండరు. నైజాంల కాలంలో ఆదిలాబాద్‌లోని రాజ్ గోండులపై రెండు విడతలుగా పరిశోదన చేసిన ఇంగ్లాండు ఆంథ్రపోలాజిస్ట్ ఆయన. క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ప్ 1976 నుండి 1978 మధ్య ఆదిలాబాద్ వచ్చి రాజ్ గోండుల మీద తన రెండో విడత పరిశోధన కొనసాగిస్తున్న సమయంలో ఆయన శిష్యుడిగా, సహపరిశోధకుడిగా యువకుడైన మైకేల్ యార్క్ ఇప్పటి కుంరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో గిన్నెధరి గ్రామంలోకి అడుగు పెట్టాడు మైకేల్ యార్క్. ముఖ్యంగా తిర్యాని లోయలోని గోండు, కొలాం గూడేల్లో ఆయన శోధన చేశారు. తరువాతి కాలంలో మైకేల్ యార్క్ ఆదివాసీ తెగల సంస్కృతుల్లోకి లోతుగా తొంగి చూసిన మేటి పరిశోధనాత్మక మానవ విజ్ఞాన డాక్యుమెంటరీ చిత్రాల రూపకర్తగా, ఉత్తమ స్థాయి ఫోటోగ్రాఫర్‌గా పేరుగడించారు.

ఆయన డాక్యుమెంటరీ చిత్రాలకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. 1976లో ఆదిలాబాద్‌లోకి అడుగుబెట్టినప్పుడు ఆయన వెంట కన్పించినవి కేవలం కెమెరా, టేపు రికార్డర్, టైప్ మిషన్లు మాత్రమే. 1976 తర్వాత హైమండార్ప్‌కు యార్కు సహచరునిగా ఉంటూ ‘మనుగడ కోసం పోరాటం’ (struggle for Survival) పుస్తక రచనకు తోడ్పడ్డాడు. 1944, జనవరి 26 న ఇంగ్లాండులో జన్మించిన మైకేల్ యోర్క్ విదేశీయుడైనప్పటికీ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడేవాడు. ఊరూరా తిరుగుతూ వారి జీవన దృశ్యాలను తన కెమెరాలో బంధించేవాడు. ఊరులో ఏ కార్యక్రమాలు జరిగినా తనకు వంట మనిషిగా నియమించుకున్న మడావి దాము సహకారం తీసుకునేవాడు.

యార్క్ తన పరిశోధనను విశ్లేషణ చేయడానికి తెలుగులో అర్ధం చేసుకోవడానికి రొంపిల్లికి చెందిన ఆడ జలపతిని నియమించుకున్నారు. దానిని ఇంగ్లీషులోకి తర్జుమా చేయడానికి ఉర్దూ టీచర్ అబ్దుల్ మజీద్ సహకారం తీసుకున్నారు. గిన్నెదారి నివాసి అయిన టీచర్ గెడం జనార్ధన్ ఆధ్వర్యంలో ఏడాది క్రితం స్ధానికంగా యార్క్ ఎడ్యుకేషన్ సొసైటీ స్ధాపించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. మైకేల్ యార్క్ ఆదిలాబాద్‌లో చేసిన పరిశోధనల ఫలితాలను గమనిస్తే – మానవ విజ్ఞాన శైలి ఫోటోగ్రఫీకి నాణ్యమైన ఉదా॥గా నిలిచే 1500కు పైగా నలుపు – తెలుపు, కలర్ ఫోటోలు తీయడం, అద్భుతమైన అంతర్ దృష్టితో రాజ్ గోండుల గొప్ప పండుగైన దండారి గురించీ విశిష్ట పరిశోధన.

ఆ కాలంలో గోండులు అనుభవించిన బాధల గురించి బ్రిటిష్ బ్రాడ్ క్కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) కోసం తీసిన డాక్యుమెంటరీ చిత్రం: ‘రాజ్ గోండులు: నెమలీకల కిరీటంలో ప్రతిబింబాలు’ (Raj Gonds: Reflections in a Peacock Crown (1982). ఆదిలాబాద్‌లో చేసిన పరిశోధన ఫలితంగా రాజ్ గోండుల సామాజిక వ్యవస్థ గురించి, వారి ఉద్యమ, చారిత్రక స్థితిగతుల గురించి మైకేల్ యార్క్ నలభై రెండేళ్ల కిందట రెండు పరిశోధనాత్మకమైన వ్యాసాలు రాశారు. వీటిని తెలుగులో అనువాదం చేసే ప్రయత్నంలో ఉన్నారు విశ్రాంత ఆకాశవాణి అధికారి సుమనస్పతి రెడ్డి.

గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News