Friday, January 17, 2025

రవాణా సౌకర్యం లేక నడిరోడ్డుపైనే ఆదివాసీ మహిళ ప్రసవం

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్: స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిన కొన్ని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేక , వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సరైన రవాణా సౌకర్యం లేక ఓ ఆదివాసీ మహిళ తీవ్ర ఇబ్బందులు పడుతూ నడిరోడ్డుపైనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే…. నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ గంగామణి రెండో కాన్పులో భాగంగా గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. అయితే తులసిపేట్ నుంచి పెంబికి రావడానికి సరైన రోడ్డు లేకపోవటంతో కుటుంబీకులు తులసిపేట్ నుంచి దొత్తవాగు మీదుగా ఎడ్లబండి సహాయంతో దాటించి ఐసిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌కు దొత్తివాగుకు త్వరగా రావాలని ఫోన్ చేయగా డీజిల్ లేదని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు.

దీంతో గంగామణి భర్త ఫోన్ పే ద్వారా రూ. 500 డ్రైవర్‌కు పంపించాడు. అయినప్పటికీ అంబులెన్స్ రాకపోవడంతో రెండు గంటలపాటు గంగామణి నడిరోడ్డు పైనే పురిటి నొప్పులతో ఇబ్బందిపడి నడిరోడ్డుపైనే ప్రసవించింది. అనంతరం పలువురి సహకారంతో చేతులపై గంగాభవాణిని మోసుకొని రోడ్డు సగం దూరం వరకు వచ్చారు. మార్గమధలో 108 అంబులెన్స్ రావటంతో పెంబి మీదుగా ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు వెంటనే తల్లిబిడ్డలకు వైద్యం అందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌కు డీజిల్ లేకపోవడం ఏమిటని బాధితురాలి కుటుంబీలకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కురిసిన వర్షాల వలన తులసిపేట్‌కు వెళ్లే పస్పుల వద్ద వంతెన నిర్మించగా భారీ వరదతతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే తులసిపేట్ కానీ, మరిన్ని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండాపోయింది. ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ ఇప్పటికైనా మారుముల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News