Thursday, January 23, 2025

ఆదివాసీలు ఉన్నత ధ్యేయం సాధించే దిశగా ముందుకు సాగాలి

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా ప్రతినిధి : ఆదివాసీలు ఉన్నతలక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏటూర్‌నాగారంలోని ఐటిడిఏ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఏటూర్ నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివాసీ అమరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన ప్రాంతంలో కలెక్టర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారీ వర్షాల వలన ఇండ్లు, వ్యవసాయ పంట పొలాలలో ఇసుక మేటలు, నష్టపోయిన, చనిపోయిన వారి వివరాలతో కూడిన నివేధిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని తెలిపారు. ఆదివాసీ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలిసే విధంగా ఐటిడిఏ కార్యాలయంలో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఆదివాసులకు ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధినీ, విద్యార్ధులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్ధులు పాఠశాలలకు అధిక సంఖ్యలో హాజరై చదువుకోవాలని సూచించారు. విద్యలో ముందు అంచెలో ఉండి చదువును కొనసాగించాలని చదువు వల్ల పై స్థాయి ఉద్యోగాలు వస్తామని తెలిపారు. పిల్లల భవిష్యత్ ను బంగారుమయం చేసే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని అన్నారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు.

జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ అటవీ భూములను సాగుచేసుకుని బతుకుతున్న గిరి పుత్రులను సీఎం కేసిఆర్ వారిని ఆ భూములకు యజమానులు చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల 6వేల 369 ఎకరాలకు గాను 1లక్ష 51వేల 146 పోడు రైతులకు పట్టాలను అందజేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు ప్రోత్సాహిస్తున్నారని చెప్పారు. జిల్లాలో గత నెలలో భారీ వర్షాల వలన ఒక్కసారిగా రాత్రి సమయంలో చెరువులు తెగిపోవడం సంభవించినందున లోతట్టు ప్రాంతాలైన మేడారం, కొండాయి, బూర్గుపేట ప్రాంతాలలో వరదలకు ప్రజలు నష్టపోవడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇటువంటి ప్రవాహాల వలన ప్రజలకు ఇబ్బంది పడకుండా శాశ్వత చర్యలు చేపట్టబోతుందని అన్నారు. కలెక్టర్, ఎస్పీ సూచనలతో అధికారులు, సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రాణాలని ఫణంగా పెట్టి వారిని వరదల నుండి కాపాడుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ కో లీడర్ పోడెం రత్నం, యాసం రాజు, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, బాలకృష్ణ, ఎంపిపి అంతటి విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యురాలు వలియాభీ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, సర్పంచ్ రాం మూర్తి, ఏపిఓ వసంతరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, పీసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఆదివాసి సంఘం సభ్యులు, మహిళలు, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News