Monday, December 23, 2024

ఆదిమ జనుల మహా శివుడు కుపార్ లింగో

- Advertisement -
- Advertisement -

ఆదివాసీలు ఏ మతానికి చెందినవారు? అసలు వీరు ఎవరిని ఆరాధించాలి? వీరి ధర్మగురువు ఎవరు? అనే సందిగ్ధత అలానే ఉండి పోతోంది. పూర్వం నుండి పురాణాల ప్రకారం ఆదివాసీలు పాటిస్తున్న ఆచార, సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక జీవనం. కాబట్టి వీరిని ప్రత్యేక ‘ఆదివాసీ ధర్మం’గా పరిగణించవచ్చు! ఎందుకంటే సింధూ నాగరికత ఏర్పడిన 6000 సంవత్సరాల క్రితం నుండి ఆదివాసీలు ప్రకృతి ఆరాధనతో పాటు తొలిసారి వారు శివున్ని కొలిచినట్టు తెలుస్తోంది. మొత్తం 88 శివావతారాలలో ప్రధానమైనది పరి పహాండి పరి కుపార్ లింగో అవతారం. 89వ శంభూని శ్రీరాముడు చంపినట్లు రామాయణంలోని ఉత్తరకాండలో ఉంది.

శంభూ శివుని జోడి గమనిస్తే, శంభూ -మూలాబాయి, శంభూ -గోదాబాయి, శంభూ రమ్లాబాయి, శంభూ సతీబాయి, శంభూ గౌరబాయి, శంభూ గిరిజా బాయి.. కాగా చిట్టచివరి జోడి శంభూ -పార్వతి. గౌరీ దేవి రూపంలో ఈయనది మహాశివుడి అవతారం. గోండి ధర్మం ప్రకారం గోండి కోయల ధర్మ గురువు కుపార్ లింగో. శివుని రెండవ అవతారమే ఈ కుపార్ లింగో. లింగోనే ఆదివాసీల మహాశివుడు, పరమాత్ముడు కూడా. ప్రాకృతిక ధర్మాన్ని పాటిస్తున్న కుపార్ లింగో పూర్వం రాజస్తాన్ లోని గ్వాలియర్ జిల్లా ఝాన్సీ ప్రాంతం నుండి పూర్వాకోట్ రాజ్యంలో పాండ్రిమర్ర అనే ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తూ.. అనేక ఆధ్యాత్మిక ప్రబోధనలు చేసినట్టు చెబుతున్నారు. లింగో తల్లిదండ్రులు పూల్ శివ, హిర్బాబాయిలది అఫ్ఘానిస్తాన్ దేశంలో ని కాందహార్ దగ్గరలోని పూర్వాకోట్ రాజ్యం.

లింగో పూర్వ చరిత్ర
శివుని రూపంలో కన్పించే లింగో లు బుద్ధుని కాలం కంటే ముందే ఏర్పడ్డాయి. 88 మంది లింగోలు శివునితో ఉన్నారు. ఈ లింగోలన్నీ నేడున్న శివ లింగాలుగా మారాయని చెబుతారు. నాగరికులు నేడు పూజిస్తున్న శివ లింగాలు గోండి కోయల ధర్మగురువుకు చెందినవి. పహాండి పారి కుపార్ లింగోను ‘కోయ పున్నెం’ (గోండి – కోయల మూలపురుషుడు )గా పిలుస్తారు. ఆదివాసీలు పూజించవలసిన అసలైన శివుడు అంటే కుపార్ లింగోనే అనేది భవిష్యత్ తరాలకు తెలియలేదు. వారు ఇప్పటికైనా గుర్తించాలి. లింగో అంటే జీవన విధానం తెలిపే వాడు అని, భీమల్ పేన్ అంటే వ్యవసాయ పద్ధతులు నేర్పించే వాడుగా చెప్పబడింది. లింగో తన తండ్రి వద్ద అనుమతి తీసుకొని 12 రకాల ఢమరుకాలు వెంటబెట్టుకొని ఐదు ఖండాలు సంచరిస్తూ అందరికీ ఆధ్యాత్మికతను, జీవన విధానాన్ని ప్రబోధించాడు. ఇంతటి లోక ప్రబోధాన్ని పంచిన లింగోలు హిందూ దేవతల కంటే పూర్వమే ఉద్భవించినట్లు పురాణాలను బట్టి తెలుస్తోంది.

గోత్రాల పుట్టక, విభజన
ఆదివాసులు నాగరిక ప్రపంచంలోకి ఆగమనం చెందాక ఆచార సంప్రదాయాల కనుగుణంగా గట్టులు, వాటి విభజన అనేవి కుపార్ లింగో కాలంలో జరిగినవి. పూర్వం గోండ్వానా ప్రాంతంలో గుహలలో, గుట్టల మీద గట్టుదేవతలు వెలసినట్టు చెబుతారు. ఆదిలాబాద్ ప్రాంతంలో రాయిసిడం జంగుబాయి గట్టు దేవతలలో ముఖ్యమైనవారు. ఇంకా నార్కోటిన్, పెన్కూ, బెనూ మొదలైన 33 గట్ట దేవతలు వెలిశారు. ఆదివాసీలకు రక్తవర్గాలు (వారసత్వాలు)గుర్తించి, డిఎన్‌ఎ ప్రకారం లింగో వారికి గొట్టులు ఏర్పరచి, వారి మధ్య వావివరసలు సృష్టించాడు.

ఇది సింధూ నాగరికత కంటే ముందు నుండి ఏర్పడ్డాయి. ఆదివాసులలో మొత్తం 12 గోత్రాలున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగు గోత్రాలుగా సరళీకరించారు. అవి 4, 5, 6, 7 గట్టులు. వీటిలో 2, 10 అనేవి 4వ గోత్రంలో: 1, 9 అనేవి 5వ గోత్రంలో: 8, 12 అనేవి 6వ గోత్రంలో, 3, 11 అనేవి 7వ గోత్రంలో మిళితమై ఉన్నాయి. వీటిని బట్టి వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఉదాహరణకు గోండ్ కోయలో ‘మాడావి’ వారు 7వ గోత్రంలో ఉన్నారు. కోయలో 3వ గట్టు వాళ్ళు కాకతీయుల కాలంలో రాజులుగా, సామంతులుగా చెలామణి అయినట్టు చెబుతున్నారు. ఆదివాసీలు తమ ధర్మగురువు లింగోకు జనవరి (పూస్ మైనా), మే (బావై మైనా) నెలలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాల ధారణ కూడా చేస్తారు. కాబట్టి ఆదివాసీల సంస్కృతి బలపడాలంటే ధర్మ గురువు కుపార్ లింగో ధార్మిక సేవలో.. మనం కొలిచే దేవతలను మరవకూడదు.

గుమ్మడి లక్ష్మీనారాయణ 9491318409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News