Wednesday, January 22, 2025

‘మహా’ మలుపు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని మహాయుతి అధికార కూటమికి మరో షాక్ తగిలింది. విపక్ష మహా వికాస్ అఘాడిలో ఏర్పడిన సీట్ల సర్దుబాటు పంచాయతీ తమకు కలిసి వస్తుందని ఆశపడిన ఏక్‌నాథ్ షిండేకు భంగపాటు తప్పలేదు.గడిచిన 15 రోజులుగా విపక్ష కూటమిలోని శివసేన (యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి(ఎస్‌పి)ల మధ్య సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చోపచర్చలు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా సాంగ్లి, భివాండీ, ముంబై సౌత్ సెంట్రల్ నియోజక వర్గాలపై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

మూడు కీలకమైన సీట్ల కోసం మూడు పార్టీలు పట్టుబట్టి రోజుకో రకంగా రాజకీయం మలుపు తిరగడంతో ఇక విపక్ష కూటమిలో సయోధ్య అసాధ్యమనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పట్టువిడిచి మూడు సీట్లను మిత్రులకు వదిలి వేయడంతో మహా వికాస్ అఘాడి కూటమి మధ్య ఐక్యత కుదిరింది. సీట్ల సంఖ్య, నియోజక వర్గాల విషయంలో కూడా సర్దుబాట్లు సాఫీగా సాగడంతో ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు కాగా, అధికార పార్టీకి తీవ్ర కుదుపుగా అక్కడి రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో 80 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలోనే అత్యధికంగా రెండో స్థానంలో 48 నియోజక వర్గాలున్నాయి.

అటు యుపి, ఇటు మహారాష్ట్రలే కేంద్రంలో అధికారానికి కీలకం కావడంతో అందరి దృష్టి మహారాష్ట్రపై నిలిచింది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను ఏక్‌నాథ్ షిండే అనూహ్యంగా మార్చివేశారు. అసెంబ్లీలో సంకీర్ణ కూటమిగా బిజెపి, శివసేనలు అధికారం చేపట్టిన తర్వాత శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి ఉద్ధవ్ బాలా సాహెబ్ ఠాక్రేపై తిరుగుబాటు చేయడంతో బలపరీక్షకు ముందు ఆయన రాజీనామా చేశారు. కేంద్రంలోని బిజెపి అండతోనే ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో పాటు బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిజెపి పెద్దలు శివసేననే కాకుండా ఆ తర్వాత ఆ రాష్ట్రంలో కీలక రాజకీయ శక్తిగా ఉన్న శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపిలో కూడా చీలిక తెచ్చారు. ఎన్‌సిపిని చీల్చిన అజిత్ పవార్‌కు బిజెపి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.

మహారాష్ట్రలో బలీయమైన పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్‌సిపిలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. అప్పటి నుంచి తమ పార్టీలను చీల్చి అధికారాన్ని అడ్డదారిలో చేజిక్కించుకున్న బిజెపిపై ప్రతీకారం కోసం విపక్షాల నాయకత్వంలోని మహా వికాస్ అఘాడి ఎదురు చూస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం చెప్పడమే తమ ఏకైక లక్షమని పొత్తును అధికారికంగా ప్రకటించిన మూడు పార్టీలు తెలియజేశాయి. మరాఠీలకు పర్వదినమైన గుడిపడ్వా రోజునే విపక్షాల సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఇది అధికార పక్షంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.

అఘాడి కూటమి సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 21సీట్లు, కాంగ్రెస్‌కు 17 సీట్లు, ఎన్‌సిపి శరద్ పవార్ వర్గానికి 10 సీట్లు కేటాయించారు. తమకు బలమున్న మూడు స్థానాలను విపక్షాల ఐక్యత కోసం త్యాగం చేశామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానాపటేల్ ప్రకటించారు. ఇది మరాఠీలకు నిజంగా పర్వదినమని శరద్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లలో బిజెపి, శివసేనలు కలిసి 41 సీట్లు గెలుచుకున్నాయి. కాని ఇప్పటి పరిస్థితిలో బిజెపికి మెజారిటీ వచ్చే సూచనలు కనిపించడం లేదని పలు సర్వేలు తెలియజెపుతున్నాయి. ముఖ్యంగా అధికారం కోసం బిజెపి మహారాష్ట్రలో ఆడిన మహా నాటకాలు ఆ పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీశాయని సర్వేలు చెబుతున్నాయి.

మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన, ఎన్‌సిపిలను చీల్చిన బిజెపిపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఈ ఎన్నికల ఫలితాలు ఎవరివి అసలైన పార్టీలో, ఎవరివి నకిలీ పార్టీలో తేలుస్తాయని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లు అంటున్నారు. మహారాష్ట్రలో మరో పార్టీగా వున్న రాజ్ ఠాక్రే నాయకత్వంలోని ఎంఎన్‌ఎస్ అధికార మహాయుతి కూటమికి మద్దతు పలికినా ఆయన ప్రభావం అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.మహారాష్ట్ర రాజకీయాలను అత్యంత జుగుప్సాకరంగా మార్చిన ఫిరాయింపులపై ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. అధికార కూటమికి నాయకత్వం వహిస్తూ పాలన సాగిస్తున్న ఏక్‌నాథ్ షిండేకు విపక్ష కూటమి ఏకతాటిపై పోటీ చేయడం ఎదురీతేనని, బిజెపికి భంగపాటు తప్పదని పరిశీలకులు జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News