Monday, December 23, 2024

జఫర్‌గడ్ రిజర్వాయర్‌కు పరిపాలనా అనుమతులు

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని జఫర్‌గడ్ పెద్ద చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. చెరువు కట్టను బలోపేతం చేసి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మార్చేందుకు పరిపాలనా అనుమతులు వచ్చినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ నీటీ పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాను.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలైన స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి, చేర్యాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టు రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్షంతో తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. వరంగల్ జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా న్యాయం జరగలేదు. కెసిఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యమ నాయకుడైన కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైతును రాజు చేయాలి, వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఆలోచనతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే సిఎం సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు.

3 సంవత్సరాల కాలంలో ఇంజినీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. అంతే కాకుండా దేవాదుల ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించి మొదటి, రెండో దశను పూర్తి చేసుకున్నాం. మూడో దశ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పథకంతో 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటి వరకు దేవాదుల ప్రాజెక్టుకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రాజెక్టు మార్పుల కారణంగా అంచనా వ్యయం అదనంగా మరో రూ.2 వేల కోట్లకు చేరింది. సిఎం కెసిఆర్ దేవాదుల ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకితం చేశారు. గోదావరి నుంచి 100 టిఎంసిల నీటిని అదనంగా ఎత్తిపోతల పథకానికి కేటాయించి 365 రోజులు నీటి సరఫరా జరిగేలా గోదావరిపై తుపాకుల గూడెం వద్ద సమ్మక్క–సారక్క ఆనకట్ట నిర్మించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుంది.

దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దేవాదుల, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ సస్యశ్యామలం అయింది. ఇందుకు నిదర్శనం గతంలో జనగామలో లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే నేడు 2022–23 సంవత్సరంలో 10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. రాష్ట్రం సాధించుకున్నాక నేడు సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, విత్తనాలు, పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందున రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేస్తుండడంతో 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది.

ఇది రాష్ట్రం సాధించిన విజయం. ప్రతి పక్షాలు గణాంకాలను తనిఖీ చేసుకోవచ్చాన్నారు. జఫర్‌గడ్ చెరువును రిజర్వాయర్‌గా చేయాలని ఇక్కడి రైతులు కోరడంతో సందర్శించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పాటు సిఎం దృష్టికి తీసుకెళ్ళాను. దీంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారు. రూ.6.197 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఉపుగల్లు రిజర్వాయర్ నుంచి పాలకుర్తికి వెళ్ళే కెనాల్ ద్వారా బోళ్ళ మత్తడి వద్ద నీటి మళ్ళీంపు చేపట్టి ఫీడర్ చానల్‌తో సాగరం ధంసా చెరువు, కోనాయచలం చెరువు నింపేందుకు అవకాశం ఉంది.

జఫర్‌గడ్ చెరువుపైన తిమ్మాపూర్ చెరువుపై నుంచి వెళ్లే కాలువపై నీటి మళ్ళింపు చేపట్టి తమ్మడపల్లి (జి), ఓబులాపూర్, తిమ్మాపూర్ చెరువులు నింపేందుకు ప్రభుత్వం అనుమతులు తెలిపింది. దీంతో జఫర్‌గడ్ మండలంలోని అన్ని గ్రామాలకు 365 రోజులు గోదావరి జలాలు అందించే అవకాశం ఉంది. సంవత్సరంలోపు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కడియం తెలిపారు.

సమావేశంలో పిఏసిఎస్ ఛైర్మన్ తీగల కర్ణాకర్ రావు, రైబస జిల్లా సమితి సభ్యుడు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, భారాస జిల్లా నాయకుడు బానోతు రాజేశ్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గోనె జైపాల్ రెడ్డి, మంద మల్లయ్య, గాదెపాక సువర్ణ అయోధ్య, బదావత్ దేవి రవి నాయక్, బొమ్మినేని శ్రీదేవి పెద్దిరెడ్డి, గాదెపాక అనిత సుధాకర్, భూక్య పార్వతి రవి నాయక్, మేడిపల్లి రాజేశ్వరి శ్రీను, అన్నెపు పద్మ అశోక్, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, కడియం యువసేన జిల్లా అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, ధనుంజయ, గాదరి బాబు, పిన్నింటి శ్రీనివాస్, వార్డు సభ్యుడు కుక్కల సారంగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News