Monday, December 23, 2024

ఆంగ్లం అయస్కాంతం

- Advertisement -
- Advertisement -

సర్కారు బడుల్లో పెరగనున్న ప్రవేశాలు

ప్రైవేట్‌కు దీటుగా మౌలిక సదుపాయాల
సృజనతో పాటు ఇంగ్లీష్ బోధన
పాఠశాలల పునఃప్రారంభం నాటికి
పనులు పూర్తి జూన్ 1 నుంచి 12
వరకు బడిబాట కరోనా కారణంగా
ఫీజుల భారం మోయలేక ప్రభుత్వ
బడులకు పెరిగిన వలసలు
వచ్చే విద్యా మరింత
పెరిగే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : సర్కారు బడుల్లో ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం కానున్నారు. త్వరలోనే టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30వేల విద్యా సంస్థలన్నింటికీ బ్యాండ్విడ్త్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడటంతో పాటు విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షితులను చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాలలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేక అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలు గణనీయంగా పెరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. దాంతో పిల్లల చదువు కోసం తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకపోగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించనుంది.

కరోనాతో పెరిగిన ప్రవేశాలు

రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2.30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. కరోనా నేపథ్యంలో ఆర్థికస్థోమత సరిగా లేకనో… సర్కారు బడిలోనూ విద్యను బాగా చెప్తారనే ఉద్దేశంతోనో… చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు మార్చారు. కుటుంబాల ఆదాయాలు తగ్గడం, ప్రైవేట్‌లో ఆన్‌లైన్ తరగతులకూ భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వ పాఠవాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌కు ఒకటే సిలబస్ ఉన్న నేపథ్యంలో ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. సర్కారు బడుల్లో విద్యార్థులను చేర్పించడం వల్ల తల్లిదండ్రులకు ఫీజుల నుంచి ఉపశమనం లభించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఈ విద్యాసంవత్సరం సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అలాగే వివిధ శాఖల పరిధిలో నడుస్తున్న గురుకులాల్లో ఐదు, ఇతర తరగతుల్లో చేరే వారి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేట్ నుంచి వలస వచ్చిన విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. సర్కారులో సాధారణ పాఠశాలలతో పాటు విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కెజిబివి)ల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 2019- 20లో 68,813 కాగా.. గత ఏడాది (2020 -21) దాదాపు లక్ష మంది ఉంటారు. కరోనా కారణంగా ప్రవేశాలు పెరిగినప్పటికీ ఆ విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

జూన్ 1 నుంచి బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకుగానూ జూన్ 1 నుంచి 12 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపింది. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడ్తున్న వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని పేర్కొంది. ఇకపై విధిగా విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News