Monday, February 10, 2025

క్రిమినల్ కేసుల ఎమ్మెల్యేలు తగ్గుదల

- Advertisement -
- Advertisement -

సగటు ఆస్తి విలువ పెరుగుదల
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఎడిఆర్

న్యూఢిల్లీ : ఎనిమిదవ ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన 70 మంది అభ్యర్థుల్లో 31 మందిక తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించినట్లు ఎన్నికల హక్కుల సంస్థ ఎడిఆర్ తెలియజేసింది. క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడవ అసెంబ్లీలోని 43 మంది ఎంఎల్‌ఎల కన్నా ఆ సంఖ్య తక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 699 మంది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఎడిఆర్, ఢిల్లీ ఎలక్షన్ వాచ్ తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న విజేత అభ్యర్థుల సంఖ్య ఆందోళన కలిగిస్తూనే ఉన్నదని తెలియజేశాయి. కొత్తగా ఎన్నికైన 17 మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు కూడా వాటిలో ఉన్నాయని విశ్లేషణ పేర్కొన్నది.

2020 ఎన్నికల్లో విజేతలైన 37 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. 2025లో కొత్తగా ఎన్నికైన ఒక ఎంఎల్‌ఎ హత్యాయత్నం సంబంధిత కేసులు ఉన్నాయని వెల్లడించగా, మరి ఇద్దరు మహిళలపై నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీల వారీగా విశ్లేషణ బట్టి 48 మంది బిజెపి ఎంఎల్‌ఎలలో 16 మంది, ఆప్ 22 మంది ఎంఎల్‌ఎలలో 15 మంది తమపై క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. బిజెపి నుంచి ఏడుగురు, ఆప్ నుంచి పది మంది తీవ్ర క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించిన విషయం విదితమే. ఆ విశ్లేషణ ప్రకారం, కొత్తగా ఎన్నికైన 70 మంది శాసనకర్తల మొత్తం ఆస్తుల విలువ రూ. 1542 కోట్లు. అభ్యర్థికి సగటు ఆస్తి విలువ 2020లోని రూ. 14.29 కోట్లు నుంచి రూ. 22.04 కోట్లకు పెరిగింది. సంపద చార్ట్‌లో బిజెపి శాసనకర్తలదే పైచేయి. వారి సగటు ఆస్తి విలువ రూ. 28.59 కోట్లు కాగా, ఆప్ సగటు ఆస్తి విలువ రూ. 7.74 కోట్లు. రూ. 115 కోట్లు నుంచి రూ. 259 కోట్లు వరకు ఆస్తులు ఉన్న ముగ్గురు బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుపొందారు. దీనికి విరుద్ధంగా ఆప్ నుంచి ముగ్గురు విజేత అభ్యర్థులు రూ. 20 లక్షల లోపు ఆస్తులు ప్రకటించారు. విశ్లేషణ ప్రకారం, విజేత అభ్యర్థుల్లో 44 శాతం మందికి రూ. 10 కోట్లు అంతకుమించి ఆస్తులు ఉన్నాయి. కేవలం 3 శాతం మందికి నికర ఆస్తుల విలువ రూ. 20 లక్షల లోపు ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News