Thursday, December 26, 2024

కల్తీ కట్టడిపై కార్యాచరణ ఏదీ?

- Advertisement -
- Advertisement -

మనం తినే తిండి, పీల్చేగాలి, తాగే నీరు సురక్షితంగా, నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోనివారుండరు. మనిషికి కనీస అవసరాలైన ఇందులోని ఏఒక్కటి కల్తీ అయినా అది ప్రాణాలకే ప్రమాదం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ, స్వార్థమే పరమావధి, లాభాలే అసలైన లక్ష్యంగా మారిన సమాజంలో సర్వం కల్తీమయం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. మానవాళికే ప్రమాదకరంగా మారిన ఈ కల్తీని సమర్థవంతంగా నిరోధించి, కల్తీసురుల ఆటకట్టించే చట్టాలే కరువయ్యాయి. కోటికి పైగా జనాభా వున్న హైదరాబాద్‌లో గడిచిన రోజు ఓ అంతర్జాతీయ ప్రముఖ కంపెనీ చాక్లెట్‌లో తెల్లపురుగు వుందని నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించడం, బేగంబజార్ కేంద్రంగా రూ. 5 లక్షలు విలువ చేసే అల్లం, వెల్లుల్లి కల్తీ పేస్టు ముఠాను పట్టుకోవడం సర్వం కల్తీమయాన్ని నిరూపిస్తున్నది.

నేషనల్ క్రైమ్స్ బ్యూరో ఇటీవల 19 నగరాల్లో ఆహార నాణ్యతపై తనిఖీలు చేయగా హైదరాబాద్ దేశంలోనే 246 కేసులతో అగ్రస్థానంలో నిలిచిందని, ఇది దేశ వ్యాప్త కేసుల్లో 84 శాతమని బ్యూరో గణాంకాలతో సహా ప్రకటించడం ఆరోగ్యరంగ నిపుణులను ఆందోళనపరుస్తోంది. ఇంటి బయట ఏది తినాలన్నా కల్తీ భయం సాధారణ ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తున్నది. అత్యధిక జనసాంద్రత, వేలాది హోటళ్ళున్న హైదరాబాద్‌లో ఆహార కల్తీని నిరోధించే అధికారులు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారంటే నియంత్రణ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వం కల్తీతో పాలితులు కల్తీ ఆహారం తిని కడుపు సంబంధిత వ్యాధులు, కేన్సర్, డయాబెటిస్, గుండె వైఫల్యం, పెరాలసిస్ వంటి సుదీర్ఘ జబ్బులతో బాధితులుగా మారినా పాలకుల్లో ఆహార కల్తీ నియంత్రణపై చీమకుట్టినట్లయిన లేకపోవడం, అధికారులు మౌన ప్రేక్షకుల్లా మూగనోము పాటించడం క్షమించరాని నేరమే. 2006లోనే ఆహార భద్రత, ప్రమాణాల చట్టం తీసుకు వచ్చినా అది కాగితాలకే పరిమితమైంది. వీధి ఆహార దుకాణాల నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ళ దాకా కల్తీసురులు చట్టంపై భయంలేక విశృంఖలంగా వీరవిహారం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో బయటపడిన కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు తయారీకి వాడిన నాసిరకం ముడిపదార్థాలు, వాటికి రంగు, రుచి, వాసన రావడానికి వాడిన కెమికల్స్, అవి తయారైన పరిసరాల పరిశుభ్రతను పరిశీలిస్తే ఒళ్ళుగగుర్పొడుస్తోంది. కల్తీ తయారీదారులు అల్లం, వెల్లుల్లి పేస్టును బ్రాండ్ల పేరు, ఐఎస్‌ఐ ముద్రతోనే రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న స్టోర్లకు కూడా పంపిణీ చేస్తున్నారని పోలీసులు చేసిన ప్రకటన చూస్తే వణికిపోని వారుండరంటే అతిశయోక్తి కాదు. పాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వెన్న, మయోనీజ్, సాస్, కోవా, బియ్యం, చాక్లెట్లు లాంటి నిత్యావసర వస్తువుల నాణ్యతపై హైదరాబాద్ నగర పాలక సంస్థ ఆహార కల్తీ నిరోధక విభాగానికి ప్రతి రోజూ వందలాది ఫిర్యాదులు అందుతున్నాయంటే కల్తీ తీవ్రత ఎంతగా విస్తృతమవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఆహార కల్తీని కూడా విధాన నిర్ణేతలు ప్రాధాన్యతా అంశంగా తీసుకొని వివిధ దేశాల్లో ఆదర్శప్రాయంగా వున్న చట్టాలను అక్కడి మాదిరిగా సంస్కరించి కఠిన శిక్షలు కల్తీసురులకు పడే విధంగా చూస్తే తప్ప కల్తీల ఆగడాలు ఆగవు.

ప్రస్తుతమున్న ఆహార కల్తీ చట్టం, అందులో భాగంగా ఏర్పాటైన యంత్రాంగాలు వీధివీధినా పెరిగిన ఆహార కేంద్రాలను ఎప్పటికప్పుడు నిఘా పెట్టి తనిఖీ చేసే పరిస్థితులు లేవు. పాలకులే మేల్కొని ఆహార కల్తీ నిరోధాన్ని అత్యవసరంగా తీసుకొని అందుకు తగిన కఠిన కార్యాచరణ అవలంబిస్తే తప్ప కల్తీ మహమ్మారిని పారద్రోలలేము. ఇప్పుడు సరైన యంత్రాంగం లేక అక్కడక్కడా, అప్పుడప్పుడూ ఆహార కల్తీ నిరోధక అధికారులు చేసే తనిఖీలు, పెట్టే కేసులు తూతూ మంత్రంగానే వున్నాయి. ఎక్కడా కేసులు పెట్టకపోవడం, పెట్టినా శిక్షలు నామమాత్రంగా కూడా లేకపోడవడంతో కల్తీ అనేది కుటీర పరిశ్రమగా మారింది. లాభమే తప్ప మనిషి ఆయుష్షుని పట్టించుకోని పరిస్థితి సర్వత్రా నెలకొన్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటి బయట ఉత్పత్తి అయ్యే ప్రతి పదార్థం లోని వాటిని ముడి పదార్థాలు, వాటి వల్ల ఆరోగ్యానికి సంభవించే లాభనష్టాలు లాంటివి పకడ్బందీగా ప్యాకింగ్‌లోనే ముద్రిస్తారు. ఆహార చట్టాల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి శిక్షలు కూడా త్వరిత గతిన పడేలా యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. దీనితో అక్కడ కల్తీకి కొంత ముకుతాడు పడింది. కాని ఆ చిత్తశుద్ధి ఇక్కడ లేకపోడం ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News