మహబూబాబాద్ : భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు మంత్రి మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం వద్ద జాతీయ రహదారి వద్ద పొంగిప్రవహిస్తున్న ఆకేరు వాగు ఉధృతిని మంగళవారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సమీక్షించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయని వివరించారు. వరద ఉదృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి వెళ్లోద్దని మంంత్రి విజ్ఙప్తి చేశారు. మంత్రితో బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, నాయకులు గుగులోతు శ్రీరామ్ నాయక్ తదితరులున్నారు.