ప్రముఖ బిజెపి నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగ రరావు ఇటీవల తన స్వీయచరిత్రను గ్రంథస్థం చేశారు. విస్తారమైన తన వ్యక్తిగ త, రాజకీయ జీవితంలో ని సంఘటనలను ఆధారం చేసుకుని రాసిన ‘ఉనిక’ పుస్తకం ఇటీవలే విడుదలైంది. ఈ పుస్తకంలోని విశేషాంశా లు మన తెలంగాణ పాఠకుల కోసం…
న్యాయానికి రామమందిర అంశానికి సంబంధించి ఒక వర్గాన్ని తృప్తిపరచడానికి తప్పు మీద తప్పు అప్పటి కాంగ్రెస్ పార్టీవారు చేయడం వల్ల అద్వానీ గారు రథయాత్ర చేపట్టడం జరిగింది. షాబాను కేసులో, అయోధ్యలో రామమందిరం తలుపుల తాళాలు తీయడంలో, రామమందిర పునర్నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాన్యాస్‌చేసే కార్యక్రమానికి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసారు. అంతేకాకుండా శ్రీరాజీవ్ గాంధీ గారు ఒక ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని అయోధ్య నుంచే ప్రారంభం చేసి ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపిస్తామని ప్రకటన చేయడం జరిగింది. తీరా అయోధ్యలో రామమందిరం పూర్తైన తరువాత ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపితేవారు రాకపోవడం ఎంత వైరుధ్యమో దేశం అర్థం చేసుకుంటుంది.
****
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ఉడతసాయం
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో నేను వ్యక్తిగతంగా ఎన్నో బాధలకు గురైనా చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం నాకు అనుమానాస్పదమైంది. సాయంత్రం లోక్‌సభలో శ్రీమతి సుష్మాస్వరాజ్ గారు బిల్లులను సమర్థించడం, అది పాస్ అయినప్పటికీ అనుమానాలు పోలేదు. ఎందుకంటే రాజ్యసభలో పాస్ కావాల్సి ఉండింది. తెల్లవారి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు కెసిఆర్ గారు తన సభ్యులతో కలసి ఈ బిల్లు వచ్చేది కాదు, పోయేది కాదు అని నిరుత్సాహంగా పోతున్న దృశ్యాన్ని చూసిన తరువాత నేను కెసిఆర్ గారితో అన్నాను, ‘రాజ్యసభ నాయకుడైన శ్రీ అరుణ్ జైట్లీతో ఒకసారి కలుస్తాము, ఎందుకంటే బిల్ గురించి అనుమానాలు నివృత్తి చేసుకోవడంతోపాటు ఆయనను మీరు కూడా ప్రత్యేకంగా కలవడం మంచిదంటే తెల్లవారి అపాయింట్‌మెంట్ తీసుకోండి అని కోరడం వల్ల తెల్లవారితే రాజ్యసభలో వారి చాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేయించాను.
నేను, కెసిఆర్, కేశవరావుగారు ఇతరులం కలసి మాట్లాడుకుంటున్నప్పుడే వారు ప్రధానమంత్రిగారితో కూడా మాట్లాడండి అని సూచించి, తప్పకుండా రాజ్యసభలో బిల్లు వచ్చినప్పుడు మద్దతిస్తాను అని భరోసా ఇచ్చారు… చర్చలలో మాత్రం శ్రీ వెంకయ్యనాయుడుగారు పాల్గొన్నారు. ఎన్నో హామీలను తీసుకున్నారు. చివరకు బిల్లు పాసయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఆనాటి హామీలకు సంబంధించిన చర్చ ఇంకా రెండు రాష్ట్రాలలో జరుగుతూంది. ఏదిఏమైనా ప్రత్యేక రాష్ట్ర సాధన వెనుక ఓ సుదీర్ఘమైన పోరాటం, ఎంతోమంది అజ్ఞాత వ్యక్తుల త్యాగాలు, బిజెపి అనుకూలుర సలహాలు దాగి ఉన్నాయి. తెలంగాణ ఏర్పడటం కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్లుగా అనే సామెత నిజమయింది అనిపించింది.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత వెంటనే మేం అన్ని జిల్లాలలో పర్యటించి కార్యకర్తలను ఎన్నికల కొరకు సన్నద్ధం చేసి హైదరాబాదు లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి సుష్మాస్వరాజ్ లాంటి నాయకురాలిని పాల్గొనేటట్లు చేసి ఉంటే ఎన్నికలలో మా పరిస్థితి వేరుగా ఉందేది అని నా అభిప్రాయం. మేం సిద్ధంగా లేమని ఎన్నికల ముందు అనూహ్యంగా ప్రజలకు చెప్పకనే చెప్పినాము. ఇంతలో టిఆర్‌ఎస్ పుంజుకున్నది.
****
నారాయణరావు పవార్ విగ్రహంపెడితే బాగుండేది!
నిజాంనే భయపెట్టిన వీరుడు నారాయణరావు పవార్ గురించి ఈ తరంవారికి అంతగా తెలియదు. నిజాం నిరంకుశ పాలన తరువాతనైనా ఆయనను ప్రభుత్వం గుర్తించి పిల్లలు చదివే పుస్తకాలలో పాఠ్యాంశమైనా, ఇంతపెద్ద హైదరాబాద్‌లో ఏ మూలనోనైనా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం పెట్టుంటే స్ఫూర్తిదాయకంగా ఉండేది… నాకైతే నారాయణరావు పవార్ గారిని భగత్ సింగ్‌తో పోల్చవచ్చని అనిపిస్తుంది. ఒకరు బ్రిటీష్ వారితో పోరాడితే మరొకరు నిరంకుశ నిజాంతో పోరాడారు.
****
నెక్లెస్ రోడ్‌లో అంబేద్కర్ విగ్రహం గర్వకారణం
ఈ మధ్యన హైదరాబాదులో నెక్లెల్ రోడ్‌లో ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం విగ్రహం కింద Statue of fraternity అని నామకరణం చేస్తే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
****
అద్వానీకి టీ ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు…!
ఒకసారి కరీంనగర్ మీదుగా అద్వానీగారి రథయాత్ర పోతున్నప్పుడు నాకు వేడి టీ కావాలని వారు (అద్వానీ) సభలో మాట్లాడేముందు అడిగారు.ఈ విధంగా యాత్రలో ఎన్నోసార్లు మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి మా ఇంట్లో తయారు చేయించిన మంచి టీని ఒక పెద్ద ఫ్లాస్క్‌లో పోసి- శ్రీ బండి సంజయ్ గారు చురుకైన కార్యకర్తగా ఉండేవారు- వారిని అద్వానీ గారు సభలలో మాట్లాడేముందు ఫ్లాస్క్ లో ఉన్న వేడి టీని అందించాలని కోరినాను. వెంటనే ఆయన దానికి అంగీకరించి, అద్వానీగారి వెంబడి బయలుదేరినారు. ఆ సంజయ్ గారే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కావడం సంతోషకరం.
****
ఎన్‌టిఆర్ పెళ్లి చేసుకుంటే మీకెందుకు అభ్యంతరం?
అద్వానీ గారి రథయాత్ర సందర్భంగా నేను వైజాగ్‌లో బహిరంగ సభలో పాల్గొన్నాను. అద్వానీ గారి రాక ఆలస్యం అయింది. కాబట్టి నా ప్రసంగం కొంచెం ఎక్కువగానే కొనసాగించాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్‌ను, టిడిపిని సమానంగా విమర్శించాలని పార్టీ ఆదేశం. అప్పటికే తెలుగు దేశంతో పొత్తు ఉండదని నిర్ణయమైంది. ఎన్ టిఆర్‌ను విమర్శిస్తూ వారు ‘హాస్పిటల్‌లో అనారోగ్యంగా ఉండడం వల్ల నాకు పరిచర్యలు చేస్తున్న లక్ష్మీపార్వతిగారిని వివాహమాడాను’ అని చాలా సార్లు చెప్పిన సందర్భాన్ని నేను విమర్శనాస్త్రంగా తీసుకున్నాను.
హాస్పిటల్‌లో ఎంతోమంది నర్సులు పేషంట్లకు పరిచర్యలు చేస్తారు, బాగా చూసుకుంటారు, అంతమాత్రాన ప్రతి రోగి ఆరోగ్యం బాగైన తరువాత కృతజ్ఞతాపూర్వకంగా పరిచర్యలు చేసిన నర్సును పెళ్లాడుతానని ప్రతిపాదిస్తే హాస్పిటళ్ల గతి ఏమవుతుంది అని చెప్పిన దానికి బాగా స్పందన వచ్చింది… శ్రీకాకుళం దాటిన తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది… అక్కడ కూడా ఎన్‌టిఆర్, లక్ష్మీపార్వతిగార్ల హాస్పిటల్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నప్పుడు సభికులలో ముందువరుసలో ఉన్నతను బిగ్గరగానే ఎన్‌టిఆర్ గారి భార్య చనిపోయింది, రెండవ పెళ్లి చేసుకుంటే మీకభ్యంతరం ఎందుకన్నాడు.సభికులలో అలజడి లేకున్నా నా మనసులో అలజడి మొదలైంది… నేను ఆ విధంగా మాట్లాడి ఉండకపోతే బాగుండేదని, అది పొరపాటని అనుకున్నాను.
****
టీచర్ కూడా ఏడో తరగతి ఫెయిలైనవాడే!
నేను నియోజకవర్గం (మెట్‌పల్లి)లో పర్యటిస్తున్నప్పుడు ఒక గ్రామంలో మహిళలు స్వాగతం పలికారు… మీ పేరు విద్యాసాగర్ రావు. మా వూరిలో విద్యనే లేదండి. మా పిల్లలు ఏడవ తరగతిలో పాసు కావడం లేదు అని బాధపడ్డారు… నేను ఊరి చివర ఉన్న స్కూలుకు పోయి చూశాను. ఆ స్కూల్లో ఏడవ తరగతి వరకు ఉంది. పిల్లలు వరుసగా 7వ తరగతిలో పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఫెయిలయినారు… కారణం తెలుసుకుంటే వారికి పాఠాలు చెప్పే పంతులు కూడా 7వ తరగతిలో ఫెయిల్ అయినవాడే… ఏడులో ఫెయిల్ అయిన టీచర్‌ను ఉద్యోగంలో ఎలా పెట్టారని అడిగితే…
జిల్లా పరిషత్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదని టీచర్లను అపాయింట్ చేయకపోతే పిల్లలను కూర్చోబెట్టి కొద్దో గొప్పో చదువు చెప్పడానికి మా ఊరివాడినే టీచరుగా పెట్టుకున్నాం. ఏం చదివిండో తెలియదయ్యా అని దీనంగా అన్నారు… అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉండింది. నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు గారు వున్నప్పుడు లేవనెత్తాను… ఎన్‌టి రామారావుగారు అప్పటి విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారిని ఉదయం 4 గంటలకే నిద్రలేపి నా తెలుగు పిల్లలు ఈ విధంగా ఫెయిల్ కావడం ఏమిటని, వీళ్లకు ఏడవ తరగతి ఫెయిలయిన టీచరు చదువు చెప్పడం ఏమిటని, వెంటనే సమస్య పరిష్కారం కావాలని ఆదేశించాడట. ఇంద్రారెడ్డి గారు నన్ను ఉదయం 5 గంటలకే నిద్రలేపి అన్నా నీవు ఏం జెప్పినావో గాని పెద్దాయన కోపంగా ఉన్నాడు. ఇవ్వాళనే ఆఫీసర్స్ మీటింగ్ పెట్టిస్తాను అని చెప్పాడు. మొత్తానికి ఆ స్కూల్‌కే కాకుండా మండలంలోని స్కూల్స్‌కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చింది. సమస్య పరిష్కారం అయింది.
****
లాలూ యాదవ్ చనిపోయాడు!
నేను కొంత మంది కార్యకర్తలకు అద్వానీ అని, వాజపాయీ అని, లాలూప్రసాద్ యాదవ్ అని పేర్లు పెట్టి పిలుస్తుండేవాడిని. ఇప్పుడు కూడా నాకు వారు ఫోన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే నేను అద్వానీని మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనం దం అనిపిస్తుంది. నేను సరదాగా పెట్టిన పేర్లతోనే సంబోధించుకుంటారు. లాలూప్రసాద్ యాదవ్ అని పిలువబడే నాయకుడు చనిపోవడం జరిగింది. ఈ మధ్యన ఆయన కూతురు, మనుమడిని తీసుకొనివచ్చి, లాలూప్రసాద్ యాదవ్ అని పేరు పెట్టానని చెప్పినప్పుడు కార్యకర్తల అనుబంధం ఎంత దూరం పోయిందో అర్థమైంది.
****
అటు పన్నీర్ సెల్వం.. ఇటు శశికళ!
జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పుడు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత నా భుజస్కంధాలపై పడింది. (తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలం పూర్తి కావడంతో మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగరరావుకు తమిళనాడు బాధ్యతలను కూడా భారత ప్రభుత్వం అప్పజెప్పింది) ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పన్నీరుసెల్వం రాజీనామా లేఖ సమర్పించారు… ఆ తరువాత సుప్రీంకోర్టులో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న అధికారపక్షం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ అక్రమాస్తుల కేసులో తీర్పును వారం రోజుల్లో వెలువరిస్తామని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.
దీంతో కొత్త చిక్కొచ్చి పడింది. పన్నీరు సెల్వం రాజీనామాను ఆమోదించాను. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు శశికళ కూడగట్టారు. వారం రోజుల్లో సుప్రీం తీర్పు… ఈ తరుణంలో ఏం నిర్ణయం తీసుకోవాలి?… యావత్ తమిళనాడు నా నిర్ణయం కోసం చూస్తోంది… అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు వరకు వేచి చూడాలన్న నిర్ణయం తమిళనాడుకు ఘోర అపప్రథను తప్పించినట్లయింది.
****
విలేఖరులు పరార్!
1998 డిసెంబర్ 25న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపాయి గారి జన్మదినం సందర్భంగా బహుశా ప్రపంచంలోనే ప్రప్రథమంగా పూర్తిస్థాయి ఎయిడ్స్ సోకిన వ్యక్తి చే, విలేఖరుల సమావేశంలో కేక్‌ను కట్ చేయించి, ఆయన చేతులమీదుగా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా కేక్ ముక్కను స్వీకరించాను…కానీ వెంటనే కేక్‌ను స్వీకరించాల్సి వస్తుందని విలేఖరులు, ఇతరులు త్వరత్వరగా వెళ్లిపోయారు. చివరికి నేను, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు, గన్‌మెన్ తప్ప ఎవరూ మిగలలేదు. తెల్లవారిన తరువాత ఇతరులతో పాటు వార్త ను చూసినవారు ఎందుకు కేకు తిన్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ ఫోన్లు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇదేదో జరగరాని సంఘటన జరిగినట్లు ప్రచారమైంది.