మన జీవితం అడుగడుగునా కళల మిశ్రమమే. మానవాభివృద్ధి క్రమమంతా కళాత్మక పరిణామ ఫలమే. జీవన సౌఖ్యంలో, సౌకర్యంలో వివిధ కళలు సృష్టించిన భౌతిక పరికరాలదే ప్రధాన పాత్ర. పిల్లనగ్రోవి మొదలు కిన్నెరమెట్ల దాకా, నాగలి కర్రు నుంచి బండి చక్రం దాకా ప్రతి పురా రూపం రేపటి ఆవిష్కరణలకు తొలి పాఠాలే. వాటిని చిన్నచూపు చూస్తే వందలేళ్ల క్రమానుగత మానవ జీవన పురోగతి అడుగుల్ని తుడిచి వేసుకోవడమే. మానవ నాగరికత మూలాల కోసం తవ్వకాలు తోడ్పడ్డట్లు మన తాతలు వాడిన ఇసిరెలన్ని అమూల్యమైనవే. నేటి పరికరాలన్నీ యాంత్రికమైన వాటి సృష్టికి మూలరూపం, ఆలోచనకు ఆధారం ఆది రూపాల నుంచే లభించింది.
పురా వస్తువుల ఆధునీకరణ ఫలితమే నేటి వాడుక వస్తు రూపాలు. ఆది కళారూపాలను, వస్తు సామగ్రిని భద్రపరచుకుంటే రాబోయే తరాలకు జీవన సౌలభ్యాన్ని, వైవిధ్యాన్ని అందించగలం. వాటి పరిరక్షణ కోసం ఆసక్తి, తపన ఉన్నవారి నుండి కృషి జరుగుతోంది. వాటిలో ప్రో. జయధీర్ తిరుమలరావు సారథ్యంలోని ఆద్య కళ ఫౌండేషన్ ప్రముఖంగా కనబడుతోంది. కొన్నేళ్ల పాటు వేలాది మైళ్ళు సంచారం చేసి వందల సంఖ్యలో మన కళలను, జీవన రీతుల్ని తెలియజేసే విలువైన సామాగ్రిని వారు సేకరించారు. వస్తు సేకరణ ఒకచోట కూచుంటే అయ్యేది కాదు. గ్రామీణ, సాంప్రదాయిక కళా సామాగ్రిని కనుగొని సేకరించడం మరీ కష్టమైన పని. గ్రామాలకు వెళ్ళాలి, డొంక దారుల్లో నడక సాగించాలి. ఆయా వస్తువుల సొంతదారులతో మమేకమవ్వాలి, వస్తువులను అప్పగించేందుకు వాటి భద్రతకు వారిలో విశ్వాసం కలిగేలా నమ్మకమీయాలి.
సేకరించిన వాటిని వాతావరణానికి చెడిపోకుండా, దెబ్బ తినకుండా భద్రపరచగలగాలి. ఎలా కాపాడాలో శాస్త్రీయంగా తెలిసుండాలి. వాటన్నిటిని పసిపిల్లల్ని సాకినట్లు సున్నితంగా చూసుకోవాలి. అలా సేకరించిన వాటిలో వివిధ రకాల సంగీత వాద్యాలతో ‘ఆది ధ్వని’ అనే ప్రదర్శనతో కూడిన వాద్యసంగీత కార్యక్రమాన్ని ఒయులోని ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఆగస్టు 2021లో ఆద్య కళ రూపాల ప్రదర్శన మాదాపూర్ చిత్రమయి గ్యాలరీలో జరిగింది. ప్రదర్శనలతో పాటు సాగిన వీటి కూర్పు చివరకు అవి ఒక ప్రదర్శనశాలకు సరిపడే స్థాయికి చేరుకుంది. వాటి సంరక్షణ హామీ ఇచ్చి తెచ్చిన సంగీత వాద్యాల, తాళపత్ర గ్రంథాల, సహజ రంగుల వస్త్ర పటాల భద్రత మానవ మాత్రులైన వారికి సవాలుగా మారింది.
వ్యయ ప్రయాసలకోర్చి, భుజాలపైనా మోసి వీటిని హైదరాబాద్ నగరానికి తరలించిన జయధీర్ తిరుమల రావుకు కొంత కాలంగా వీటి సంరక్షణ జ్వరం పట్టుకుంది. ఇవన్నీ ఏమైపోతాయి అనే రంధి పట్టుకుంది. కేవలం ప్రభుత్వాల వల్లే సాధ్యమయ్యే ఆద్య కళ మ్యూజియం కోసం గత కొంత కాలంగా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘ఆద్య కళ వస్తు సంపద ఏమైపోతుందో అని భయం, ఆందోళనల మధ్య బతుకుతున్న సమయంలో ఇలాంటి సాహితీ మిత్రుల పలకరింపు ఒక ఓదార్పు’ అని ఓ సమావేశంలో తిరుమలరావు వక్తగా మాట్లాడుతూ అనడంలో ఆయన బాధ వ్యక్తమవుతోంది. ‘ఆద్య కళ తెలంగాణ ప్రజలది. అది దక్కన్ ప్రజల గుండెకాయ. జానపద గిరిజన ప్రజల సృజనాత్మక శక్తి. భారతీయ, ప్రాంతీయ ప్రజల వర్తమాన నాగరికత చిహ్నాలివి. సబ్బండ వర్ణాల సాంస్కృతిక చిహ్నాలని, వేలాది ఎకరాలు, వందలాది పాత బిల్డింగులు అందుబాటులో ఉన్న రాష్ట్రంలో వాటిలో ఏ ఒక్కటి కేటాయించినా ఆద్య కళని బతికిస్తుంది.
ఆదివాసీల, అణగారిన ప్రజల సౌందర్యాత్మక ప్రతీకలు పంచ రంగుల జండాలై రెపరెపలాడుతాయి. లేదంటే కూలిపోతాయి’ అని కలవరిస్తూ తనను కలవరపెడుతున్న వైనం ఆయన పేస్ బుక్‌లో చూడవచ్చు.. పోయిన నెలలో పురాతత్వ ప్రదర్శనశాల వారి ఆహ్వానంపై ఆయన ప్యారిస్ వెళ్లి ఆద్య కళ మ్యూజియం గురించి, తెలంగాణ ప్రాంతపు, భారత దేశపు జానపద ఆదివాసి కళల గురించి, సంస్కృతి గురించి, ముఖ్యంగా వస్తు సంస్కృతి అధ్యయనాల గురించి కొన్ని ప్రసంగాలు చేసి వచ్చారు. ఆ స్ఫూర్తితో ఆయన ‘ఇండియాలో కాకపోతే ఈ భూమి మీద, భూగోళంలో ఎక్కడైనా ఆ వస్తువులనీ, కళాఖండాలని జాగ్రత్త పరచాల్సిన బాధ్యత ఉంది’ అనడంలో ఆయన సంకల్పబలం తెలుస్తోంది.
ఆద్య కళ మ్యూజియం ఏర్పాటు దిశగా మరో ప్రయత్నంగా కొత్త తరహాలో పరిరక్షణ కమిటీ 24 జనవరి 2023, మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓ ప్రెస్ మీట్‌ను నిర్వహిస్తోంది. దీనిలో ప్రొ. ఘంటా చక్రపాణి, పూర్వ టిపిఎస్‌సి చైర్మన్, గోరటి వెంకన్న, ఎంఎల్‌సి. కె రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్టు, వర్ధెల్లి మురళి ఎడిటర్ సాక్షి, కె శ్రీనివాస్ ఎడిటర్ ఆంధ్రజ్యోతి, చుక్కా రామయ్య, కిన్నెర మొగిలయ్య పాల్గొంటారని కమిటీ ప్రకటనలో ఉంది. ఏడుపదులు దాటిన వయసులో ఈ ఆద్య కళ భారాన్ని మోస్తున్న జయధీర్ తిరుమలరావు పట్ల సామాజిక మాధ్యమాల్లో ఎందరో మద్దతు పలుకుతుంటారు. ప్రశంసల జల్లు కురిపిస్తారు. వారిలో వీలైనవారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని మీ తోడుగా మేమున్నామని ప్రత్యక్షంగా ప్రకటించే అవసరముంది. ప్రదర్శనశాల ఏర్పాటుకై తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించేందుకు సంతకాల సేకరణ కూడా ఈ సభ ఉద్దేశం. ఆద్య కళ మిత్రులు, అభిమానులు ఈ సభలో పాల్గొని మద్దతు తెలపాలని కమిటీ కోరుతోంది.
బి.నర్సన్
9440128169