Wednesday, January 22, 2025

దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత్ లోని అఫ్గానిస్థాన్ కాన్సుల్ జనరల్ జికియా వార్ధక్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో ఆమెను అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు … ముమ్మర తనిఖీలు చేయగా, ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ముంబైలో ఏప్రిల్ 25న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వార్ధక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు.

ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్నారు. విమానం దిగిన తరువాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్ పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే ఎయిర్ పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా, ఆమె వాటిని తోసి పుచ్చారు. దీంతో ఆమెను గది లోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించారు. ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్, ఫ్యాంట్, మోకాలి క్యాప్, బెల్ట్‌లో ఏకంగా 25 బంగారం కడ్డీలు బయటపడ్డాయి.

ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె కుమారుడి వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించక పోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్ట్ చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండడంతో ఆమెను అదుపు లోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే ఈ వార్తా కథనాలపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతం తాను ముంబైలో లేనని, వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News