పాకిస్తాన్ గో బ్యాక్, మీ కీలు బొమ్మ సర్కార్ వద్దు అంటూ నినాదాలు
పాక్ ఎంబసీ ఎదుట నిరసనకు భారీగా తరలిన మహిళలు
చెదరగొట్టేందుకు తాలిబన్ల కాల్పులు, అదుపులోకి పాత్రికేయులు
కాబూల్ : అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో హై టెన్షన్ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్ సహకరిస్తోందని, తమ దేశంలో పాక్ జోక్యం, పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ కాబూల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ తీరుకు నిరసనగా మంగళవారంనాడు భారీ ఎత్తున తరలివచ్చి ఇక్కడి పాక్ ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. వీరిలో అత్యధికులు మహిళలే ఉన్నారు. పాక్ గో బ్యాక్, పాక్ చేతిలో కీలుబొమ్మ సర్కారు మాకు వద్దు, పాకిస్తాన్కు మరణశాసనం తప్పదు, ఐఎస్ఐకి ఇక్కడేం పని అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే ర్యాలీగా తరలివచ్చిన వారిని చెదరగొట్టేందకు తాలిబన్లు కాల్పులు జరిపారు. నిరసన ప్రదర్శనను రిపోర్టు చేస్తున్న పలువురు అఫ్ఘన్ మీడియా ప్రతినిధులను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి వారిని వదిలిపెట్టారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. దీంతో నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని, హింసే వారి ఆయుధమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్లు విడిచిపెట్టిన అనంతరం ఒక మీడియా ప్రతినిధి తన ఆవేదనను బయటపెట్టరు. తాలిబన్లు నిరసనను కవర్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారని, తన ముక్కును నేలకు రాయించడమే కాకుండా క్షమాపణ చెప్పిన తర్వాత వదిలిపెట్టారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాత్రికేయుడు వివరించారు. ‘భవిష్యత్లో అఫ్ఘన్లో జర్నలిజానికి ఇబ్బందులు తప్పవు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అరెస్టయిన వారిలో తమ జర్నలిస్టు వాహిద్ ఆహ్మదీ ఉన్నారని టోలో న్యూస్ వెల్లడించింది.