ఐక్యరాజ్యసమితి : అఫ్ఘనిస్థాన్‌ను లింగపరమైన వివక్షతల దేశంగా ప్రకటించాలని డిమాండ్ తలెత్తింది. ఈ దేశంలో పలు రకాల అణచివేతలు, వెలుగులోకి రాని నిర్బంధాలతో అక్కడి మహిళ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని యుఎన్ ఉమెన్ కార్యనిర్వాహక సంచాలకులు సిమా బహౌస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్ఘన్ మహిళలు, అక్కడి బాలికలపై జులుం సాగుతోంది. దీనిని ప్రపంచ సభ్య దేశాలన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంది. అఫ్ఘన్‌ను జెండర్ ద్రోహ దేశంగా పరిగణించే దిశలో పలు దేశాలు చట్టపరమైన చర్యలకు దిగాలని భద్రతా మండలిలో ఆమె సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా లింగసమానత నిలబెట్టేందుకు ఈ సంస్థ ఐరాస సారధ్యంలో ఏర్పాటు అయింది. అఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే 50కి పైగా అత్యంత కటువైన తాలిబన్ శాసనాలు వెలువడ్డాయి. వీటిని ఇప్పుడు కుటుంబంలోని మగవారు మహిళలను అణచివేసేందుకు యధేచ్చగా వాడుకుంటున్నారు. దీనితో ఆడవారు అక్కడ ఇంటికి బందీలై చెప్పలేని స్థాయిలో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి యువతులు ఎక్కువగా ఇక చేసేదేమీ లేక ఆత్మహత్యల ఆలోచనలతో ఉన్నారని వివరించారు. బందీలమైపోయి, ఎటువంటి భవిష్యత్తు లేకుండా కుమిలిపోతున్నామని వాపోతున్నారని, ఈ పరిస్థితికి అంతంఅవసరం అని తెలిపారు.