లాహోర్: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో బెర్త్ కోసం జరిగిన కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టు తడబడింది. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు అఫ్గాన్ బ్యాటర్లు తేలిపోయారు. సెదికుల్ల, అజ్మతుల్లా మినహా మిగితా బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే పరిమితం కావడంతో ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది అఫ్గాన్.
గఢఫీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. సెదికుల్ల అటల్(85), అజ్మతుల్లా ఒమర్జాయ్(67) ఇద్దరు జట్టును ఆదుకొనే ప్రయత్నం చేసినా.. ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో ఆఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో డ్వారషూస్ 3, స్పెన్సర్, జంపా తలో రెండు, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు.