Friday, December 20, 2024

కల చెదిరిన అఫ్గానిస్థాన్

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: వెస్టిండీస్, యుఎస్‌ఎలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ అంచనాలకు మించి రాణించింది. లీగ్‌తో పాటు సూపర్8 దశలో రషీద్ ఖాన్ సారథ్యంలోని అఫ్గానిస్థాన్ అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గాన్ అనూహ్యంగా సెమీస్‌కు చేరుకుని పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను మట్టికరిపించింది. శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టగా అఫ్గాన్ మాత్రం చిరస్మరణీయ ప్రదర్శనతో సూపర్8 అర్హత సాధించింది. ఈ దశలో కూడా అఫ్గాన్ అత్యంత నిలకడైన ఆటతో అలరించింది.

ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో కూడిన అఫ్గాన్ ఈ వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించింది. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తూ ముందుకు సాగింది. లీగ్ దశలో న్యూజిలాండ్‌పై అద్భుతం విజయం అందుకుంది. సూపర్8లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను చిత్తుగా ఓడించింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అఫ్గాన్ టీమ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ సఫారీతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అఫ్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది. సౌతాఫ్రికా బౌలింగ్ ధాటికి ఎదురు నిలువలేక కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో అఫ్గాన్‌కు సెమీస్‌లో ఘోర పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గాన్‌పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

సౌతాఫ్రికా మ్యాచ్‌లో సంచలన విజయం సాధిస్తుందని వారు భావించారు. కానీ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ అఫ్గాన్ సెమీస్‌లో పూర్తిగా తేలిపోయింది. సఫారీ టీమ్‌కు కనీస పోటీ కూడా ఇవ్వకుండానే ఓటమి చవిచూసింది. దీంతో అఫ్గాన్‌తో పాటు ఉపఖండంలోని కోట్లాది మంది అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన అఫ్గాన్ సెమీస్‌లో సంచలనం సృష్టిస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే సెమీస్‌లో తప్పిస్తే మిగతా మ్యాచుల్లో అఫ్గానిస్థాన్ ఆటను ఎంత పొగిడినా తక్కువే. ఏమాత్రం అంచనాలు లేని అఫ్గాన్ టీమ్ సెమీస్‌కు చేరుకోవడం అతి పెద్ద సంచలనంగానే చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లో అఫ్గాన్ మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News