Monday, January 20, 2025

తాలిబాన్ల ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కొద్ది తేడాలతో అన్ని మతాలు మహిళకు రెండవ తరగతి పౌరసత్వాన్నే ఇచ్చాయి. పురుషులతో సమానమైన పరిగణనకు ఆమెను అనర్హురాలుగానే చేశాయి. ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలు స్త్రీ పురుషులిద్దరికీ సమాన ఓటు హక్కుతో పాటు అన్ని రంగాల్లోనూ ఒకే ప్రాధాన్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంట్లో, వీధిలో మగాధిపత్యం మహిళను ఇంకా కట్టడి చేస్తూనే వుంది. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలకు పట్టుగొమ్మ అనిపించుకొంటున్న అమెరికాలోనే మితవాద న్యాయం అబార్షన్ హక్కును రద్దు చేసి సమ సమాజ విలువలను, మానవతను, శాస్త్రవిజ్ఞాన స్పృహను వెక్కిరించిన పరిణామం ఇటీవలిదే. పచ్చి అభివృద్ధి నిరోధకులు అధికారంలో వుండే చోట వారి కత్తివేటు పడేది ముందుగా మహిళల మీదనే అని తరచూ రుజువవుతున్నది. ఈ ధోరణి భారత దేశంలోనూ ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. భారతీయ సమాజంలో స్త్రీ నాలుగ్గోడల మధ్య వుండి పురుషునికి సేవ చేయవలసిందేనని ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థల పీఠాల నుంచి ప్రవచనాలను వింటున్నాము.

ఇరాన్‌లో హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు కొన్ని మాసాలుగా వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అఫ్ఘానిస్తాన్ మహిళలు కూడా వారి అడుగుల్లో అడుగులు వేయడం ప్రారంభించారు. ఉన్నత విద్యాభ్యాస హక్కును స్త్రీలకు నిరాకరిస్తూ దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటా వారికి ప్రవేశాన్ని అఫ్ఘాన్ పాలకులు మొన్న బుధవారం నుంచి నిషేధించారు. వర్శిటీల్లో చదువులకు హాజరు కానవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని విశ్వవిద్యాలయాల వద్ద భద్రతా దళాలను నియమించారు. దీనితో ఇంత వరకు విశ్వవిద్యాలయాల్లో చదువుకొంటూ వచ్చిన అఫ్ఘాన్ మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్నత విద్యా సంస్థల ముఖద్వారాల వద్ద నిరసన చేపట్టారు. వారి పట్ల సంఘీభావంతో కొంత మంది పురుష విద్యార్థులు, అధ్యాపకులు కూడా తరగతులు బహిష్కరిస్తున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే కాదు, ప్రైవేటు వర్శిటీల్లోనూ స్త్రీలు చదువుకోరాదని తాలిబాన్లు స్పష్టం చేశారు.

నిరసన ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులు విద్యను రాజకీయం చేయొద్దు, మహిళలను వెలివేయొద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే అఫ్ఘాన్‌లో మహిళలకు సెకండరీ విద్యావకాశాలను మూసివేశారు. మహిళ చదువుకొన్న సమాజమే పురోగమిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యం.కాని ప్రగతిని వ్యతిరేకించే శక్తులు పరిపాలించే చోట ఈ నిజం వెలుగులు వెదజల్లడానికి అవకాశం లభించదని అఫ్ఘాన్ ఉదంతం నిరూపిస్తున్నది. గతంలో 2001కి ముందు ఐదేళ్ళ పాటు అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు పరిపాలించినప్పుడు కూడా మహిళలు ఇదే దుస్థితిని అనుభవించారు. అప్పుడు ఇప్పుడు మగవారి తోడు లేకుండా మహిళ వీధిలోకి రాకూడదు. తాలిబాన్లు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు పాదరక్షలు బయటికి కనిపించేలా దుస్తులు ధరించరాదనే నిబంధనను అమలులోకి తెచ్చినట్టు వార్తలు చెబుతున్నాయి. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రాక ముందు అఫ్ఘాన్ మహిళ ఇప్పటి కంటే మెరుగైన జీవితాన్ని అనుభవించింది.

విద్యావకాశాలు లభించడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పార్లమెంటులో కూడా వారికి ప్రాతినిధ్యం వుండేది. మహిళలకు విశ్వవిద్యాలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ అఫ్ఘానిస్తాన్ పాలకులు తీసుకొన్న చర్యను పాకిస్తాన్, కతార్ వ్యతిరేకించడం గమనార్హం. ఇస్లాం మత నియమాల ప్రకారం ప్రతి పురుషుడికి మహిళకు సమానంగా విద్యా హక్కు వుంటుందని తాము గట్టిగా నమ్ముతున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇస్లాం నియమాల వెలుగులో ఈ నిషేధాన్ని పునః పరిశీలించాలని తాలిబాన్లకు కతార్ విజ్ఞప్తి చేసింది. ఈ నిషేధం విధించినందుకు అఫ్ఘాన్ పాలకులు తగిన పర్యవసానాలను ఎదుర్కొంటారని అమెరికా హెచ్చరించింది.

సామాజిక మాధ్యమాల నిండా ‘ఆమెను చదువుకోనివ్వండి’ అనే నినాదం హోరెత్తుతున్నది. తాలిబాన్ పాలకులకు ఇస్లాం గురించిన పరిజ్ఞానం గాని, మానవ హక్కుల స్పృహ గాని బొత్తిగా లేదని అక్కడ విశ్వవిద్యాలయ విద్యను అభ్యసిస్తున్న ఒక పురుష విద్యార్థి చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యానం ముమ్మాటికీ నిజం. వారు మహిళను అణచివేయజూస్తున్నారని, ఆమె ఇంటికే పరిమితమై పిల్లలను కనే యంత్రంగా మనుగడ సాగించాలని కోరుకొంటున్నారని కాబూల్ విశ్వవిద్యాలయంలో జర్మన్ సాహిత్యం చదువుకుంటూ వచ్చిన 21 ఏళ్ళ సెతారా ఫరహ్‌మండ్ అనే విద్యార్థిని చేసిన వ్యాఖ్యానం ముమ్మాటికీ వాస్తవం. అంతర్జాతీయ సమాజం అభిప్రాయాన్ని గౌరవించి తాలిబాన్లు స్త్రీకి పూర్తి స్వేచ్ఛను పునరుద్ధరిస్తారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News