Tuesday, September 17, 2024

నెదర్లాండ్స్‌పై అఫ్గాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో అఫ్గాన్‌కు ఓవరాల్‌గా నాలుగో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అఫ్గాన్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించిన అఫ్గాన్ తాజాగా నెదర్లాండ్స్‌ను కూడా మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 31.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రహమానుల్లా గుర్బాజ్ (10), ఇబ్రాహీం జర్దాన్ (20) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు.

అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మాత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిదిలు అద్భుత బ్యాటింగ్‌తో అఫ్గాన్‌ను ఆదుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. వీరిని ఔట్ చేసేందుకు నెదర్లాండ్స్ కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహ్మాత్ షా 54 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న షాహిది 6 ఫోర్లతో అజేయంగా 56 పరుగులు చేశాడు. అతనికి అజ్మతుల్లా 31 (నాటౌట్) అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడిన మరో వికెట్ కోల్పోకుండానే అఫ్గాన్‌ను గెలిపించారు.

కొంపముంచిన రనౌట్లు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ బర్రెసి (1)ని ముజీబ్ వెనక్కి పంపాడు. అప్పటికీ జట్టు స్కోరు 3 పరుగులే. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన అకర్‌మన్‌తో కలిసి మరో ఓపెనర్ మాక్స్ డౌడ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ధాటిగా ఆడిన డౌడ్ 9 ఫోర్లతో 42 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఆ వెంటనే అకర్‌మన్ (29) కూడాపెవిలియన్ చేరాడు. ఇతను కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ ఎడ్వర్డ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఎడ్వర్డ్ కూడా అఫ్గాన్ అద్భుత ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ నబి వెంటవెంటనే మూడు వికెట్లు తీయడంతో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 179 పరుగుల వద్ద ముగిసింది. ఒంటరి పోరాటం చేసిన సైబ్రాండ్ ఆరు బౌండరీలతో 58 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News