Saturday, July 6, 2024

అఫ్గాన్ సంచలనం

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచకప్ సూపర్8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 21 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి అఫ్గాన్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కంగారూలకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వార్నర్‌లు విఫలమయ్యారు. హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నవీనుల్ హక్ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరోవైపు వార్నర్ కూడా 3 పరుగులు మాత్రమే చేసి నబి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ మిఛెల్ మార్ష్ కూడా నిరాశ పరిచాడు. మార్ష్ తన పేలవమైన బ్యాటింగ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 32 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మాక్స్‌వెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి స్టోయినిస్ (11) కాస్త అండగా నిలిచాడు. మరోవైపు అఫ్గాన్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీస్తూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. గ్లెన్ మాక్స్‌వెల్ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో నవీనుల్ హక్ మూడు, గుల్బదిన్ నైబ్ నాలుగు వికెట్లను పడగొట్టారు.

శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గుర్బాజ్ 49 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 6 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. అయితే తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో అఫ్గాన్ స్కోరు 148 పరుగులకే పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News