నమీబియాపై 62 పరుగుల తేడాతో గెలుపు
సెమీస్ ఆశలు సజీవం
అబూదాబి: ఐసిసి టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాట్ చేసి 161 పరుగుల భారీ లక్షాన్ని నిర్దేశించిన అఫ్గానిస్థాన్ ఆ తర్వాత నమీబియాను వంద పరుగుల లోపే కుప్ప కూల్చి సెమీ ఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది. భారీ విజయ లక్షంతో బరిలోకి దిగిన నమీబియా ఏ దశలోనూ విజయం దిశగా అడుగులేయలేక పోయింది. అనుభవజ్ఞులైన అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. వరుసపెట్టి వికెట్లు కోల్పోతుండడంతో ఒకానొక దశలో 70 పరుగులు కూడా చేయడం కష్టమేననిపించింది. అయితే డేవిడ్ వీజ్ కాస్సేపు అఫ్గాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని 26 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేయగలిగింది. వీజ్ తర్వాత ఈటన్ చేసిన 14 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. అఫ్గాన్ బౌలర్లలో హమీద్ హసన్, నవీన్ ఉల్ హక్ చెరి మూడు వికెట్లు పడగొట్టగా , గుల్బాదీన్ నైబ్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
తొలుత టాస్‌గెలిచి బాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(33), మహ్మద్ షంజాద్ (45) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే పవర్‌ప్లేలో ధాటిగా ఆడిన అఫ్గాన్‌ను నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లతో పాటుగా రహమాన్‌తుల్లా(4),జాద్రాన్ (7)లను ఔట్ చేసి కాస్త పట్టు సాధించారు. అయితే అస్గర్ అఫ్రాన్( 31),కెప్టెన్ మహ్మద్ నబీ (32 నాటౌట్)లు ఆఖర్లో దూకుడుగా ఆడి జట్టు మంచి స్కోరు సాధించేలా చేశారు. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపుల్మన్, జాన్ నికోల్‌లు చెరి 2 వికెట్లు పడగొట్టగా, స్మిత్ ఒక వికెట్ తీశాడు.