న్యూఢిల్లీ : ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో ఇప్పటివరకు 6 చీతాలు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ప్రాజెక్టు చీతాలో భాగమైన ఆఫ్రికా నిపుణులు భారత ప్రభుత్వానికి నివేదిక ద్వారా కీలక అంశాలు వెల్లడించారు. నడి వయస్సు చీతాల కంటే యుక్తవయస్సులో ఉన్నవాటిని తీసుకొస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు నివేదకలో పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వాహనాలు, మనుషుల సంచారానికి అలవాటు పడిన వాటిని ఎంపిక చేసుకోవడం మంచిదని తెలిపారు. సాధారణంగా యుక్త వయసులో ఉన్న చీతాలకు కోపం తక్కువ .వాటిలో అవి పోట్లాడుకోవు.
వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల చిన్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా త్వరగా కోలుకునేందుకు అవకాశమెక్కువ. నడివయసు దాటిన చీతాలకు వ్యాధి నిరోధక శక్తి క్రమంగా సన్నగిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు వాతావరణంలో కలిగే మార్పులకు అవి తట్టుకోలేవు. దీంతో అవి చనిపోతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఎంతో వెచ్చించి వయసు మళ్లిన చీతాలను దిగుమతి చేసుకుంటే వాటి జీవిత కాలం తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.
మరో 10 చీతాలు రెడీ
భారత్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు మరో 10 చీతాలను సిద్ధం చేశారు. భారత్ అధికారుల సూచనల మేరకు 19 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వాటిని ఎంపిక చేశారు. 2024 ప్రారంభంలో వీటిని భారత్‌కు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు.