Thursday, December 19, 2024

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఆఫ్రికన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రియల్టర్లు, వ్యాపారులను నకిలీ కరెన్సీతో మోసం చేస్తున్న ఐవరీ కోస్ట్‌కు చెందిన జాతీయుడిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, ఎల్‌బి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ ఇండియన్ కరెన్సీ రూ.10లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఐవరీకోస్ట్‌కు చెందిన జోన్ గ్యూ రోస్టాండ్ అలియాస్ దౌడా బిజినెస్ వీసాపై ఇండియాకు 2021లో వచ్చి సన్‌సిటీ,బండ్లగూడ, రాజేంద్రనగర్‌లో ఉంటున్నాడు. ఇతడి వీసా గడువు జనవరి, 2022లో ముగిసింది, అయినా కూడా ఇండియాలో అక్రమంగా ఉంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు ఇండియన్ నకిలీ కరెన్సీని అస్త్రంగా చేసుకున్నాడు.

ఒక నోటుకు రెండు నోట్లు ఇస్తానని పలువురిని నమ్మించి మోసం చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడికి ఇలాగే మాయమాటలు చెప్పి రూ.25లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఎల్‌బి నగర్‌లో వ్యాపారులను మోసం చేసేందుకు రాగా పోలీసులు పట్టుకున్నారు. ముందుగా తన ఎడమ చేతిలో రెండు ఒరిజినల్ కరెన్సీ నోట్లను దాచిపెట్టి, బాధితులకు ఇచ్చిన నకిలీ కరెన్సీ నోట్ల నుంచి ఒక నోటును తీసుకుంటాడు. దానిని రెండు తెల్లకాగితాల మధ్య ఉంచి కెమికల్స్ వేస్తాడు. కొద్ది సేపటి తర్వాత దానిని తీసేముందు బాధితుల దృష్టి మరల్చుతాడు, ఆ సమయంలో నకిలీ కరెన్సీ నోట్‌ను తీసివేసి తన ఎడమ చేతిలో ఉన్న నోటును దాని స్థానంలో పెడుతాడు. దానిని నీటిలో వదిలేస్తాడు, అదివెలసి పోకపోవడంతో బాధితులు నిందితుడు తమకు ఒరిజినల్ నోట్లు ఇస్తున్నట్లు భావించి అసలు నోట్లను నిందితుడికి ఇస్తున్నారు.

వాటిని తీసుకున్న తర్వాత రోస్టాండ్ తాను ఇచ్చిన బ్యాగును నాలుగు నుంచి ఐదు గంటల వరకు తెరవవద్దని వారికి చెప్పి అక్కడి నుంచి పారిపోయేవాడు. తర్వాత బాధితుడు తెరిచి చూసేసరికి నకిలీ కరెన్సీ, తెల్లకాగితాల కట్టలు కన్పిస్తాయి. ఇలా అమాయకులను మోసం చేసి అసలైన నోట్లతో పరారవుతున్నాడు. ఇలాగే మోసం చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఎస్సైలు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News