కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా
గువాహటి: అస్సాం నుంచి పూర్తిగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఎఎఫ్‌ఎస్‌పిఎ) త్వరలోనే రద్దు చేయవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తీవ్రవాద సంస్థలతో ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న దరిమిలా శాంతి భద్రతలు మెరుగుపడడంతో కొన్ని జిల్లాలలో ఈ చట్టాన్ని పాక్షికంగా ఉపసంహరించడం జరిగిందని ఆయన చెప్పారు. మంగళవారం నాడిక్కడ అస్సాం పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్స్ ప్రధానం చేసిన అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కృషి ఫలితంగా చాలావరకు తీవ్రవాద సంస్థలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని, యావత్ రాష్ట్రం హింస, తీవ్రవాదం నుంచి విముక్తమయ్యే రోజు సమీపంలోనే ఉందని అన్నారు. ఎఎఫ్‌ఎస్‌పిఎను 23 జిల్లాల నుంచి పూర్తిగా ఒక జిల్లాలో పాక్షికంగా ఉపసంహరించామని, అస్సాం వ్యాప్తంగా దీన్ని ఉపసంహరించే రోజు సమీపంలోనే ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి లొంగిపోయి, జనజీవన స్రవంతిలోకి తిరిగివచ్చిన వారందరినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.