Wednesday, January 22, 2025

20ఏళ్ల తర్వాత కుటుంబసభ్యుల చెంతకు..

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మతిస్థిమితం సరిగా లేక 20ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వృద్ధురాలు.. మక్తల్ ఎంపిడిఒ శ్రీధర్ మానవతా హృదయంతో స్పందించడంతో శనివారం కుటుంబసభ్యుల చెంతకు చేరింది. మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన బందెలి కొండమ్మ(85) అనే వృద్ధురాలు గత 20ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇద్దరు కుమారులు కొండమ్మ ఆచూకీ కోసం తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఎక్కడైనా చనిపోయి ఉంటుందని భావించారు.

అయితే మహబూబ్‌నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో నివాసం ఉండే మక్తల్ ఎంపిడిఒ శ్రీధర్ శనివారం ఉదయం విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వస్తుండగా, అటు పక్కన అచేతన స్థితిలో పడివున్న వృద్ధ మహిళను చూసి భార్య రమాదేవి, కుటుంబసభ్యులతో కలిసి ఆమెకు సపర్యలు చేసి వివరాలు అడుగగా, విలపిస్తూ తమది మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామం అని తెలపడంతో కొండమ్మను తన కారులోనే గుడిగండ్లకు తీసుకువచ్చారు.

గుడిగండ్ల ఎంపిటిసి భర్త నర్సిరెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డిలకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని కొండమ్మను గుర్తించారు. అయితే కొండమ్మ కుమారులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటుండడంతో వారికి ఫోన్‌లో సమాచారం అందించగా, కొండమ్మ కోడలు గ్రామానికి చేరుకుని తమ అత్త కొండమ్మను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20ఏళ్లుగా ఇంటికి దూరమై దీనావస్థలో ఉన్న కొండమ్మను మానవతా హృదయంతో కుటుంబసభ్యుల చెంతకు చేర్చిన మక్తల్ ఎంపిడిఒ శ్రీధర్‌కు గుడిగండ్ల గ్రామస్తులు, కొండమ్మ కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News