Thursday, January 23, 2025

తెలంగాణ వచ్చాక కవులు, కళాకారులకు సమాజంలో గౌరవస్థానం

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణ కోటి రతనాల వీణ
  • నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

మెదక్/కొల్చారం: తెలంగాణ వచ్చాక సిఎం కవులు, కళాకారులు, సాహితివేత్తలకు సమాజంలో గౌరవస్థానం ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి పలు సాహితి సమావేశాల ద్వారా సముచితంగా సత్కరిస్తున్నారని అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కొల్చారంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రాగౌడ్, ప్రజాప్రతినిధులతో కలిసి కోలచల మల్లినాథ సూరి విగ్రహానికి పూలమాలలు సాహితి నీరాజనం అర్పించారు.

అనంతరం మెదక్ పట్టణంలోని హ్యాపీ మూమెంట్ బాంకెట్ హాల్‌లో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రతిభింబించేలా సాగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ కవి కొలచాల మల్లినాథ సూరి స్వస్థలమైన కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని దేశపతి శ్రీనివాస్, రమణాచారి వంటి వ్యక్తులతో పలుమార్లు సిఎంని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయగా అటువంటి గొప్ప వ్యక్తికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చి యదాద్రికి వెళ్లవలసిన సంస్కృత విశ్వ విధాలయాన్ని ఇక్కడ ఏర్పాటుకు అనుమతించడం నిజంగా కవులు, సాహితి అభిమానులపై సిఎంకి ఉన్న గౌరవం స్పష్టమవుతుందని అన్నారు.

ఇటీవలే విశ్వవిధ్యాలయం ఏర్పాటుకు స్థల పరీశీలన జరిగిందని, సిఎం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చే సందర్భంగా విశ్వవిద్యాలయం శంకుస్థాపన కూడా చేయించుటకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ సందర్భంగా భూములు కొల్పోయిన వారికి తగిన న్యాయం చేస్తామన్నారు. సిఎం సాహితి ప్రియుడని 21 రోజులపాటు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇందుకు చక్కని ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ… 14వ శతాబ్దపు వాడైనా మల్లినాథసూరి మన మెదక్ జిల్లా కావడం గర్వకారణమని అన్నారు. పశువుల కాపరి నుంచి రుషి ఆశీస్సులు, దైవబలంతో గొప్ప పండితుడయ్యాడని, వారి పేర కాశీలో ఆడిటోరియం నిర్మించబడి ఉందన్నారు.

19 శాస్త్రాలలో ప్రావీణ్యం గడించిన పండితులు, సంస్కృతంలో అర్థమయ్యే రీతిలో వ్యాక్యానాలు రాశారని అన్నారు. దేశంలో 16 సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉండగా ఆయన పేర ఇక్క 17వ సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేయడం ముదాహమని అన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాహితి వేత్తలను ప్రభుత్వం గుర్తించలేదని, కానీ నేడు సాహితి ప్రియుడైన మన ముఖ్యమంత్రి తెలుగు మహాసభలు పెట్టి కవులు, కళాకారులు, సాహితి వేత్తలకు ఎనలేని గుర్తింపు ఇచ్చారని అన్నారు. గుర్తింపు లేక కనుమరుగులో ఉన్న ఎందరో మహానీయులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సముచితంగా గౌరవిస్తున్నదని అన్నారు.

జిల్లాలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు వల్ల మరెందరో గొప్ప సాహితివేత్తలను దేశానికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కల్టెర్ రాజర్షి షా మాట్లాడుతూ తమ రచనల ద్వారా కవులు, సాహితి వేత్తలు సమాజ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరు వారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. మహానీయులు నడయాడిన చోట ఆ మట్టిని స్పుషిస్తే జన్మధన్యమైనట్లని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కవులు, కళాకారులను గౌరవిస్తూ అధికారికంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నదని అన్నారు. సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఎందరో పండితులు వెలుగొందుతారని అన్నారు.

జిల్లాలోని వెల్దుర్తిలో మాణిక్యరావు అనే గొప్ప కవి ఉన్నారని, వారి కోడలు లతను జిల్లా యంత్రాంగం తరపున జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ సన్మానించారని అన్నారు. ఈ సందర్భంగా 40 మంది తెలుగు, ఉర్దూ కవులు అభివృద్ధి అంటే తెలంగాణ తెలంగాణ అంటే ఆనందం వంటి తెలంగాణ సాదించిన ప్రగతి ప్రతిభింబించేలా కవితా గానం చేశారు. ఇట్టి కవితలను పుస్తక రూపంలో ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం కవులను జ్ఞాపిక, ప్రశంసపత్రాలతో అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, డిఎస్పి సైదులు, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు అద్యక్షులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, డిఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తహశీల్దార్లు చంద్రశేఖర్, శ్రీనివాస్, జడ్పిటిసిలు, ఎంపిపిలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News