వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జోక్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌సి జెనిటిక్స్ టాపర్ విష్ణు వచన బంగారు పతకాన్ని స్వీకరించడానికి మార్గం సుగమమైంది. స్పాన్సర్ లేరన్న కారణంతో తనకు ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ నిరాకరించిన విషయాన్ని విష్ణు వచన గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన గవర్నర్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటక్‌ను సంప్రదించారు. గోల్డ్ మెడల్ స్పాన్సర్ చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. అక్టోబర్ 31న జరిగే స్నాతకోత్సవంలో విష్ణు వచనకు బంగారు పతకాన్ని ప్రదానం చేయనున్నట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
స్పాన్సర్ లేని కారణంగా బంగారు పతకాన్ని అందచేయలేకపోతున్నామని ఉస్మానియా యూనివర్సిటీ ఇదివరకు విష్ణు వచనకు తెలియచేసింది. స్నాతకోత్సవంలో పాల్గొనడానికి కూడా ఆమెకు ఆహ్వానం లేదని యూనివర్సిటీ తెలిపింది. దీనిపై మనస్థాపం చెందిన విష్ణు వచన గవర్నర్ తమిళిసైకు ఒక లేఖ రాశారు. వెంటనే గవర్నర్ స్పందించడంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా గోల్డ్ మెడల్ స్పాన్సర్ చయడానికి ముందుకు వచ్చారు. జైనెటిక్స్ రంగంలో విశేష ప్రతిభ కనబరిచి మెరిట్‌లో ఉత్తీర్ణురాలైన విష్ణు వచనను గుర్తించినందుకు గవర్నర్ తమిళిసై భారత్ బయోటెక్ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.
2022లో ఉస్మానియా యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ నుంచి జెనెటిక్స్‌లో విష్ణు వచన మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని సిఎస్‌ఐఆర్-సిసిఎంబిలో డాక్టోరల్ డిగ్రీ(పిహెచ్‌డి) చేస్తున్నారు. 2020-2022 బ్యాచ్‌కు చెందిన ఎంఎస్‌సి జెనెటిక్స్ విద్యార్థి అయిన విష్ణు వచనకు 10కి 8.75 సిజిపిఎ సాధించి ప్రథమ డివిజన్‌లో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు.