2005లో బిజెపి ఎంఎల్‌ఎ కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గూండాల చట్టం కింద సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) ఎంపి అఫ్జల్ అన్సారీకి నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ ఘాజీపూర్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దోషిగా నిర్ధారణకు వ్యతిరేకంగా అన్సారీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌కె సింగ్ అనుమతించడంతో ఆయన ఇక పార్లమెంట్ సభ్యునిగా కొనసాగవచ్చు.
ఘాజీపూర్ ఎంపి శిక్ష వ్యవధి పెంచాలని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, కృష్ణానంద్ రాయ్ కుమారుడు పీయూష్ కుమార్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. ఘాజీపూర్‌లోని ఎంపి ఎంఎల్‌ఎ కోర్టు 2023 ఏప్రిల్ 29న గూండాల చట్టం కేసులో అన్సారీని దోషిగా నిర్ధారించి, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. దీనితో అన్సారీని ఎంపిగా అనర్హుని చేశారు. ఆయన అప్పుడు హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు.