Thursday, January 23, 2025

మళ్ళీ వాయిదాల పార్లమెంటు

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే దేశం యావత్తు తలదించుకొనేలా చేసిన మణిపూర్ సోదరీమణుల నగ్న ఊరేగింపు దారుణ ఘటన ఉభయ సభలనూ దద్దరిల్లజేసింది. రెండో రోజూ అదే పరిస్థితి చోటు చేసుకొని సభలను అరంగుళమైనా సాగకుండా చేసింది. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు మణిపూర్ మరి కొన్ని రోజుల పాటు పార్లమెంటు సమయాన్ని హరించడం ఖాయమని బోధపడుతున్నది. ఈసారి సమావేశాలను 23 రోజుల్లో ముగించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. 17 రోజులు సమావేశమై 31 బిల్లులను పరిశీలించాలని అనుకొన్నారు. మణిపూర్ సమస్య మీద ప్రధాని మోడీ సమక్షంలోనే చర్చ జరగాలని 26 పార్టీల ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ఆశిస్తున్నది.

మణిపూర్ ఘటన 140 కోట్ల మంది భారతీయులూ సిగ్గుపడవలసినదని ప్రకటిస్తూ ఆ కల్లోలం చెలరేగిన 78 రోజుల తర్వాత మొట్టమొదటి సారిగా నోరు విప్పిన ప్రధాని పార్లమెంటుకు మాత్రం మొహం చాటు చేశారు. ‘ఇండియా’ ప్లకార్డులతో ప్రతిపక్ష కూటమి మొదటి రోజు సమావేశాల్లోనే ప్రధాని పార్లమెంటుకు రావాలంటూ నినాదాలు చేసింది. లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి శాంతించలేదు. వాయిదాల మీద వాయిదాలతో మొదటి రెండు రోజులూ రెండు సభలూ ఏ కార్యక్రమం చేపట్టకుండానే ముగిసిపోయాయి. ప్రతిపక్ష కూటమి సోమవారం నాడు మణిపూర్ అంశంపై సభలో బైఠాయింపు చేపట్టనున్నట్టు వార్తలు చెబుతున్నాయి. వాస్తవానికి ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టదలిచారు. ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వ సర్వీసులు, వాటిని అజమాయిషీ చేసే అధికారుల మీద అదుపాజ్ఞలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వానివేనని, లెఫ్టినెంట్ గవర్నర్ ఆ రాష్ట్ర మంత్రివర్గం చెప్పినట్టు నడుచుకొని తీరాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ యథాతథ స్థితిని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చుకోవాలని నరేంద్ర మోడీ సర్కారు తహతహలాడుతున్నది.

ఈ బిల్లును ఓడించి తీరాలని ఆప్ దీక్ష వహించింది. అందుకోసం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సహకారాన్ని కూడా అర్థించింది, అది అందుకు అంగీకరించింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు మరి కొన్ని కీలకమైన బిల్లులను కూడా ఈ సభలో ప్రవేశపెట్టాలనుకొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంటరీ కార్యక్రమం నిరాటంకంగా జరగాలంటే ప్రతిపక్షాలు ముందుకు తీసుకొచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి తన వద్ద గల ప్రణాళికను వాటి ముందుంచాలి. తమ తీరును ప్రజలు గమనిస్తున్నారనే స్పృహతో చట్టసభలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.

మే 4వ తేదీన మణిపూర్‌లో జరిగిన దానిని చెప్పడానికే నోరు సిగ్గుపడుతుంది. అటువంటి ఘాతుకం, ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి గురి చేసి అందులో ఒక మహిళ తండ్రిని, సోదరుడిని హతమార్చిన దారుణ ఉదంతంపైన, దాని మూలాల్లో గల గత రెండు నెలలకు పైబడి కొనసాతున్న బీభత్సంపైన ప్రధాని మోడీ సవివరమైన ప్రకటనను పార్లమెంటులో చేయవలసి వుంది. అది దేశ ప్రజల పట్ల ఆయన ప్రభుత్వం నిర్వర్తించవలసిన కనీస బాధ్యత. ఆ తర్వాత పార్లమెంటులో సాకల్యమైన చర్చకు అవకాశం ఇవ్వాలి. దీనిని మరచి పాలక పక్షం ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజల దృష్టిలో పలచబడిపోడం అనివార్యం. లోక్‌సభకు, కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలు చేరువలో వున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తన తప్పును అంగీకరిస్తుందని అనుకోలేము. కేంద్రంలోనూ, మణిపూర్‌లోనూ రెండు చోట్లా అధికారంలో వుండి అనేక సార్లు తానే గొప్పగా చెప్పుకొన్న డబులింజిన్ ప్రభుత్వం నడుస్తున్న చోట ఇంత సుదీర్ఘ కాలం కల్లోలం చెలరేగడం వెనుక గల పరిస్థితిలేమిటో బిజెపి వివరించడం సులభ సాధ్యం కాదు. మెజారిటీ మెయితీలు హిందువులు కావడంతో వారి డిమాండ్‌కు అనుగుణంగా వెనుక నుంచి కథ నడిపించి ఈ ఆందోళకరమైన, సిగ్గు పడవలసిన పరిస్థితులను బిజెపి స్వయంగా తానే సృష్టించింది. దీనిని అంగీకరించడానికి దానికి మనసొప్పదు. అలా ఒప్పుకొంటే లోక్‌సభ ఎన్నికలకు ముందే తాను ఓడిపోయినట్టు కాగలదనే భయం దానిని పీడిస్తున్నది. అయితే ఈ ఇరకాటమైన పరిస్థితి నుంచి తెలివిగా తప్పుకోడం సాధ్యం కాదనే సంగతి దానికి తెలుసు. అందుచేత పార్లమెంటు సమావేశాల మిగిలిన రోజులన్నీ ప్రతిపక్ష ఉభయ సభలనూ ప్రతిపక్షం ఆట విడుపుకి వదిలేసి తాము సహకరిస్తామన్నా పడనీయడం లేదనే నిందకు దానిని గురి చేయడమే బిజెపి ప్రధాన వ్యూహమని అనుకోవలసి వుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల మిగతా రోజులు కూడా వాయిదాల పర్వంగానే కొనసాగినా ఆశ్చర్యపోవలసిన పని లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News