Sunday, December 22, 2024

‘వత్తే’శారు!

- Advertisement -
- Advertisement -

ఒక్కొక్కరి నుంచి రూ. 1.70లక్షల డిపాజిట్
సంస్థ యజమాని ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్(-బోడుప్పల్): నగర శివారు బోడుప్పల్ కేంద్రంగా వత్తుల తయారీ పేరిట ఎబిజి సంస్థ దాదాపు వెయ్యి మంది నుంచి డిపాజిట్ల పేరిట రూ. 20 కోట్ల మేరకు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన బాధితులు ఎబిజి సంస్థ యజమాని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..బోడుప్పల్‌లో బాలస్వామి గౌడ్ ఎబిజి వత్తుల తయారీ పేరిట ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించాడు. వత్తుల తయారీకి సంబంధించిన యంత్రాలు, దూది ఇస్తామని తయారు చేసిన వత్తులను కిలో రూ.300 చొప్పున తమకే విక్రయించాలని ప్రచారం చేపట్టాడు.

అయితే వత్తుల యంత్రానికి సంబంధించి ఒక్కో వ్యక్తి నుంచి లక్ష 70వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలని షరతు విధించాడు. ఈక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన 1000 మంది నుంచి దాదాపు రూ. 20 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైన ఎజిబి సంస్థ రెండు నెలల పాటు కిలో వత్తులకు రూ. 600 ప్రకారం చెల్లింపులు చేసింది. ఈక్రమంలో నాలుగు నెలల నుంచి ఎజిబి సంస్థ గత నెల రోజులు డబ్బు చెల్లించకపోవడం, సదరు సంస్థ యజమాని బాలస్వామి గౌడ్ ఫోన్ తరచూ స్విచ్చాఫ్ రావడంతో బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎజిబి సంస్థపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఆన్‌లైన్‌లో ప్రచారం
ఏదుల దీపం వత్తుల కంపెనీ అన్‌లైన్ బిజినెస్ పేరుతో సంవత్సరం కిందట నుంచి యూట్యుబ్ ,సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో విస్తృతంగా ప్రచారం చేపట్టింది. దీంతో ఇంటి వద్దే ఉంటూ సులువుగా డబ్బులు సంపాందించే అవకాశం ఉందనే ప్రచారం జరగంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన సుమారు 1000 మంది వరకు వొత్తులు తయారీ చేసే మిషనరీని కొనుగోలు చేశారు. సంస్థ యజమాని బాలస్వామి విక్రయించే మిషనరీ ధర రూ.1.70 లక్షలు గాకా వొత్తులను కాటన్ కూడా విక్రయించడం,తయారైన వొత్తులను అతనే కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాపారం రెండు నెలల పాటు సజావుగానే సాగింది. గత నాలుగు నెలల నుండి సంస్థ యజమాని బాలస్వామి గౌడ్ కస్టమర్లకు దొరకకుండా తప్పించుకు తిరగటం మొదలు పెట్టాడు.దీంతో అనుమానం వచ్చిన వందలాది మంది కస్టమర్లు ఫోన్ చేసిన సమాధానం చెప్పక పోవడం ,ఆఫీసులో అందుబాటులో ఉందడకపోవడంతో గత నెల ఎజిబి కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

దీంతో స్పందించిన బాలస్వామి గౌడ్ మార్కెట్‌లో కాటన్ ధర పెరగడంతో కొంత ఇబ్బందులు వచ్చాయని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికాడు. మరో రెండు నెలలు గడచినా బాలస్వామి నుంచి ఏలాంటి స్పందన రాకపోవడంతో పదిహేను రోజుల క్రితం బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాధితులకు సమస్యలను పరిష్కరిస్తానని సంస్థ యజమాని బాలస్వామి పోలీసుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నాడు.అయితే ఇప్పటికి దాకా ఏలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం నాడు బోడుప్పల్ లోని ఎదుల కంపెనీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో బాధితులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.బాధితుల ఆందోళన విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎసిపి, ఉప్పల్ సిఐ గోవింద రెడ్డి,మేడిపల్లి డిఐ ప్రవీణ్‌లు సంఘటన స్థలానికి చెరుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎజిబి సంస్థ యజమాని బాలస్వామిగౌడ్‌ను అరెస్టు చేసి అతని బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి బాధితుల సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు వివరించడంతో బాధితులు ఆందోళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News