ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల భారీ ధర్నా
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు అన్ని జిల్లాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు.ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ ఉద్యోగాలు 20 వేల వరకు ఉన్నాయి. వీటి గరిష్ట వయోపరిమితి పెంచకపోతే దాదాపు లక్ష మందికి ఉద్యోగ అర్హత కోల్పోతారు. రాష్ట్రంలో పొలీస్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరికి 25 సంవత్సరాలుగా ఉంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలలో యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా ఉందన్నారు. నిరుద్యోగుల కష్టాలను పరిగణలోకి తీసుకొని ఈ దఫా గరిష్ట వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పెంచాలని ఆయన కోరారు. తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, సంఘం అధ్యక్షుడు జంపాల రాజేష్, మధుసూదన్, వేముల రామకృష్ణ, జి.అనంతయ్య, చంటి ముదిరాజ్, పగిళ్ళ సతీష్, కట్ట బబ్లు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.