Saturday, November 9, 2024

రైతులకు మించిన పరిశోధకులా?

- Advertisement -
- Advertisement -

AgHub was started by Minister KTR

ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు

ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే
ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా
నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్‌కు అనుసంధానిస్తాం రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో
మాట్లాడొచ్చు రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వర్శిటీలో నాబార్డు సాయంతో నిర్మించిన
అగ్రిహబ్‌ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్ పాల్గొన్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : దేశంలో రైతును మించిన ఇన్నోవేటర్ మరొకరు ఉండరని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇన్నోవేషన్ ఎవరి సొత్తుకాదన్నారు. ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో ఇన్నోవేషన్లు చేస్తున్నారన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వస్తున్న మార్పులకు, సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనలను మరింతగా ప్రోత్సహి ంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవను ందన్నారు. ఈ హబ్ ద్వారా వ్యవసాయ ఆవిష్కరణలను ప్రో త్సహించాలని పిలుపునిచ్చారు. రైతు వేదికలను కూడా టీఫైబర్ ద్వారా అనుసంధానిస్తామన్నారు. దీంతో రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో సంభాషించే వెసలుబాటు ఉంటుందన్నారు.

సోమవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో రూ.9 కోట్ల వ్యయంతో నాబార్డ్ సాయంతో నిర్మించిన అగ్రిహబ్‌ను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగ్రిహబ్ ఎంతగానో ఉయోగపడనుందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువగా తీసుకెళ్లనున్నామన్నారు. ఇందులో భాగంగా త్వరలో జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లలో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకరావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమన్నారు.

ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు, రైతులు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు ఈ హబ్ ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రధానంగా రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు సైతం అగ్రిహబ్‌లో అందుబాటులో ఉంటాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు రావడం సంతోషకరమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆహార భద్రత పెద్ద సవాల్ గా ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ఆహార భద్రత కాకుండా న్యూట్రిషన్ ఫుడ్ పై దృష్టి సారిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరుగుతుంది కానీ అందుకు అనుగుణంగా ఉత్పాదన, ఆదాయం కూడా పెరగాల్సిన అవసరముందన్నారు. ఆ దిశగా పరిశోధనలు జరగాలని అని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట

దేశంలో 55 నుండి 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూడా దేశానికి మన రాష్ట్రమే ఆదర్శంగా మారుతోందన్నారు. ఒక్క రైతు బంధు కోసమే సంవత్సరానికి రూ.15 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
కేవలం సంప్రదాయమైన పంటలే కాకుండా ప్రసుతం ఆయిల్ పామ్ సాగు పంటలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగా 20లక్షల ఎకరాల లో సాగు విస్తీర్ణం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే రాష్ట్రంలోని 2,601 రైతు వేదికలకు టి..ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంను రైతు వేదికలో ప్రసారం అయ్యేటట్లు చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో మరింత పరిశోధనలు పెరగాలన్నారు.

ప్రపంచమే అబ్బురపడే విధంగా సాగునీటి ప్రాజెక్టులు

ప్రపంచమే అబ్బురపడే విధంగా స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రదానంగా మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్ వంటి సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన నీటి సౌలభ్యం, కావాల్సినంత కరెంటు సరఫరా చేస్తున్న కారణంగానే రాష్ట్రంలో పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో దేశానికే రాష్ట్రం ధాన్యాగారంగా మారిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎఫ్‌సిఐ ధృవీకరించిందన్నారు. ఒకప్పుడు దేశంలో ఆహారభద్రత ఒక సవాల్‌గా ఉండేదని దీన్ని విజయవంతంగా అధిగమించగలిగామన్నారు.

ఆహారధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించాం

ఆహారధాన్యాల ఉత్పత్తిలో మన రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయితే పెరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని రావాలన్నారు. ప్రపంచంలో ఆహారానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. నూతన ఆవిష్కరణల సాయంతో సమతుల్య, పౌష్టికాహారం అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. రైతులు కూడా సంప్రదాయ పద్దతుల నుంచి బయటి కొచ్చి నూతన సాంకేతికత వైపు దృష్టి సారించాలన్నారు.వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం పై పరిశోధనలు విస్తృతం కావాలన్నారు. త్వరలో సిఎం కెసిఆర్ చేతులమీదుగా వేరుశనగ పరిశోధన కేద్రాన్ని ప్రారంభించన్నుట్లు మంత్రి ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశోధనల కోసమే వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. ఆయిల్‌పామ్ సాగుని పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. అదేవిధంగా నూనెగింజల ఉత్పత్తి పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అగ్రిహబ్‌కు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు.

రీసెర్చ్,టెక్నాలజీలు కలిస్తే రైతాంగానికి మేలు

అంతకు ముందు నాబర్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతల మాట్లాడుతూ తమ సాయంతో దేశంలో ఏడు ఇన్‌క్యూబేటర్లు ఏర్పాటు అయ్యాయన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. రీసెర్చ్,టెక్నాలజీలు కలిస్తే రైతాంగానికి మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆహారపు అలవాట్లు బాగా మారాయన్నారు. అందుకు అనుగుణంగా కొత్త వెరైటీలు తీసుకురావాలని ఆయన సూచించారు. సమీకృత వ్యవసాయ పద్దతులపై వర్సిటీలు పని చేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లు చాలా అవసరమన్నారు. ఈ అగ్రి హబ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని గోవిందరాజులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు ప్రకాశ్‌గౌడ్, వర్సిటీ ఉపకులపతి డా. ప్రవీణ్‌రావు, అగ్రి హబ్ ఎండి డాక్టర్ కల్పనాశాస్త్రి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రంగారెడ్డి జిల్లా జిల్లా పరిష్యత్ చైర్మన్ అనితాహరినాథరెడ్డితో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News