Wednesday, January 22, 2025

7 రాష్ట్రాలకు పాకిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు

- Advertisement -
- Advertisement -

‘Agneepath’ concerns spread to 7 states

బీహార్, యుపిలలో పలు రైళ్లకు నిప్పు
బీహార్‌లో ఒకరు మృతి, నేతల ఇళ్లపై దాడులు
యుపి బల్లియా రైల్వే స్టేషన్‌లో విధ్వంసం
గురుగ్రాంలో 144 సెక్షన్
ఒడిశాలోని కటక్‌లోనూ ఆందోళన
200కు పైగా రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగాపెద్ద ఎత్తున ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు, రైల్వే ఆస్తులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాలకు ఈ నిరసనలు పాకగా మొత్తం 200కు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ బీహార్‌లో శుక్రవారం మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. పలుప్రాంతాల్లో ఆందోళనకారులు రహదారులు, రైల్వేట్రాక్‌లపైకి చేరి నిరసనలు చేపట్టారు. బెగుసరాయ్ జిల్లా లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న రైలుకు నిప్పు పెట్టారు. మరోవైపు బెట్టాయ్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు.లఖిసరాయ్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

యుపిలోనూ ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో రైల్వే స్టేషన్ల వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగారు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. అయితే ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బల్లియా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బల్లియావారణాసి మెమూ, బల్లియా షాగంజ్ రైళ్ల బోగీలకు నిప్పుపెట్టిన దృశ్యాల వీడియోలు వైరల్ అయ్యాయి. ఆందోళనకారులు రైల్వే గోడౌన్ సమీపంలో షాపులపైన రాళ్లు రువ్వారు. రైల్వే స్టేషన్‌ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రైవేటు షాపులపైనా దాడి చేశారు. అలీగఢ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ క్రమంలో ఆందోళకారులు పోలీసు వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రాలక్నో హైవేపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో నాలుగు బసులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని హల్దానీ ప్రాంతంలో ఆందోళనకారులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో లాఠీచార్జి చేశారు.

గురుగ్రామ్‌లో 144 సెక్షన్

హర్యానాలోనూ అగ్నిపథ్‌పై ఆందోళనలు చెలరేగాయి.నిరసనకారులు రహదారులను నిర్బంధించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు నగరమంతటా 144 సెక్షన్‌ను విధించారు.

ఢిల్లీలో మెట్రోల వద్ద భద్రత

ఢిల్లీలో ఛాత్ర యువ సంఘర్ష్‌సమితి నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనల దృష్టా పలు మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో విద్యార్థులు రోడ్లపై టైర్లకు నిప్పంటించి ధర్నా చేపట్టారు.

కటక్‌లో రహదారుల నిర్బంధం

ఒడిశాలోని కటక్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న వందలాది మంది విద్యార్థులు కటక్‌లో రింగ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో పాటుగా కంటోన్మెంట్ ఏరియాలు పలు హోర్డింగ్‌లను చించివేశారు. ఆందోళనకారుల్లో చాలా మంది గత ఏడాది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ పరీక్షలు పాసయి కామన్ ఎంట్రన్స్ పరీక్ష( సిఇఇ) రాయడానికి ఎదురు చూస్తున్న వారే కావడం గమనార్హం. బాలసోర్ జిల్లాలో ఆర్మీలో చేరడానికి ఎదురు చూస్తున్న ధనంజయ్ మొహంతీ అనే 27 ఏళ్ల యువకుడు అగ్నిపథ్ పథకం ప్రకటనలో నిరాశకు లోనయి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త పొక్కడంతో వీరంతా ఆందోళనకు దిగారు. అతను ఏడాదిన్నర క్రితమే దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణుడయి రాతపరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు.

200కు పైగా రైళ్లు రద్దు

దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ఆందోళనల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 200కు పైగా రైళ్లపై నిరసనల ప్రభావం పడింది.ద క్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేశాయి. మరి కొన్నింటిని దారి మళ్లించాయి.తూర్పు మధ్య రైల్వే 59 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News