అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 56,960 మంది అగ్నివీర్ వాయు పోస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే త్రివిధ దళాల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై ఆది నుంచి ఉన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేరి నాలుగేళ్ల తర్వాత రిటైరైన సైనికులకు తాము చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాయా? లేదా అనే అంశంపై రాష్ర్ట ప్రభుత్వాలు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.
ముఖ్యంగా బిజెపియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎలాంటి స్పష్టత లేదు. దీంతో అగ్నివీరులుగా చేసిన వారి భవిష్యత్తు ఏంటనేది అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన తర్వాత పలు రాష్ట్రాల్లో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో బిజెపి పాలిత రాష్ట్రాలైన యుపి, మధ్యప్రదేశ్, హరియాణ, ఉత్తరాఖండ్, అస్సాం ప్రభుత్వాలు అగ్నివీరులకు కోటా ప్రకటించాయి. తమ ప్రభుత్వాలు చేపట్టే పోలీసు నియామకాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించాయి.
అగ్నివీరులకు సంబంధించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కొన్ని హామీలు గుప్పించారు. రాష్ర్ట పోలీసు నియామకాల్లో గ్రూప్-సి (నాన్‌గెజిటెడ్) పోస్టులను కేటాయిస్తామని చెప్పారు. అయితే ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అదే విధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పోలీసు, చార్‌ధావ్‌ు విపత్తుల నిర్వహణ విభాగాల్లో అవకాశం ఇస్తామని పేర్కొంది. కానీ ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. అలాగే, యుపి, మధ్యప్రదేశ్, అసోంలు కూడా అగ్నివీరులకు తమ విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కోటాపై స్పష్టత ఇవ్వలేదు. ప్రధాని సొంత రాష్ర్టం గుజరాత్‌లోనూ అగ్నివీరులకు ఎలాంటి రిజర్వేషన్ ఇస్తారనే విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు.
అదే విధంగా కేంద్ర హోం శాఖ తన పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపియఫ్), అస్సాం రైఫిల్స్‌లోనూ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే నిపుణులు మాత్రం ఇది అంత తేలిక విషయం కాదంటున్నారు. ఎందుకంటే రాష్ర్ట పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు పైగా అగ్నివీరులు అన్ రిజర్వ్‌డ్ కోటాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు సిఎపియఫ్‌లో కానీ, ఇటు రాష్ట్రాల పోలీసుల నియామకాల్లో కానీ అగ్నివీరులకు కోటా అమలు చేయడం కష్టమే. ఎందుకంటే వీరి క్వాలిఫికేషన్ కూడా ఈ నియామకాలకు ఇబ్బందిగా మారుతుంది. ఆర్మీ నియామక విధానానికి, రాష్ట్రాల పోలీసు నియామకానికి చాలా తేడా ఉంటుంది. అక్కడి రిజర్వేషన్లు ఇక్కడ వర్తించవని ఈ మధ్య కాలంలో ఒక రాష్ట్రానికి చెందిన పోలీసు నియామక బోర్డు అధిపతే అన్నారు.
మరి ఇలాంటి ఎన్నో సందేహాలు, సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం సైనిక దళాలలోకి రిక్రూట్‌మెంట్ విధానాన్ని పూర్తిగా మారుస్తూ నూతన విధి విధానాలను ప్రకటించి కొత్త రిక్రూట్‌మెంట్ విధానానికి అగ్నిపథ్ అని పేరు పెట్టింది. ఈ స్కీం కింద తీసుకున్న వారిని అగ్నివీరులు అని పిలుస్తారని కూడా చెప్పింది. ఈ పథకం కింద సంవత్సరానికి 45,000 నుండి 50,000 మందిని తీసుకుంటారు. 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వయో పరిమితిని విధించారు. ఈ పరిమితులకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత వయో పరిమితిని 23 సంవత్సరాలకు పొడిగించారు. రిక్రూట్ అయిన వారిలో నాలుగింట మూడొంతుల మంది నాలుగు సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంటారు. 25 శాతం మంది మాత్రమే 15 సంవత్సరాలు సర్వీస్ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ స్కీవ్‌ు ప్రకారం వారు ఏ విధమైన పెన్షన్లు, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందటానికి అర్హులు కారు.
సైన్యంలో అధికారుల స్థాయికి తక్కువగా ఉండే జవాన్లు, నౌకాదళంలో సహాయకులు (సెయిలర్స్), వైమానిక దళంలో సహాయక సిబ్బందిని అగ్నిపథ్ పథకం కింద తీసుకుంటారు. ఈ పథకం కింద రిక్రూట్ చేసుకొనే వారితో దేశ రక్షణ బలపడుతుందని, సైనిక బలగాలలో యువత సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నది. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీరులు తిరిగి సమాజంలోకి వచ్చి సేవ చేస్తారని, అది సమాజానికి గొప్ప సంపదగా ఉంటుందని చెబుతున్నది. కానీ వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. సైనిక దళాల కోసం కేటాయించిన నిధులలో ఎక్కువ భాగం సైనికుల వేతనాలు, పెన్షన్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నదని, సై
నిక దళాలను అందువలన ఆధునీకరించటానికి నిధుల కొరత ఎదురవుతున్నదని, ప్రస్తుతం ప్రకటించిన అగ్నివీర్ పథకం ద్వారా నిధులను ఆదా చేసి, ఆ మొత్తాన్ని ఆధునీకరణ కోసం వినియోగించుకోవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి అగ్నివీర్ పథకం ద్వారా సైనిక దళాలలోకి రిక్రూట్ చేసుకొనే వారికి పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఉండవు. పథకానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యువతను చల్లబరచటం కోసం రిటైరైన 75 శాతం మంది అగ్నివీరులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తమ సంస్థలలో ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం ప్రోద్బలంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రకటించాయి. వారిని పోలీస్ దళాలలోకి తీసుకోవటంలో ప్రాధాన్యత ఇస్తామని కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ప్రకటించాయి.
కానీ ప్రస్తుతం కోట్ల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వటంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదు. మాజీ సైనికోద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటానికి ఏ రాష్ర్ట ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం లేదా కార్పొరేట్ సంస్థలు కానీ శ్రద్ధ చూపించలేదు. ఇపుడు నాలుగు సంవత్సరాలు సర్వీస్‌లో ఉండి రిటైరయ్యే అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పిస్తామంటే నమ్మేదెలా? 17.5 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వయసులో సర్వీస్‌లో చేరి, నాలుగు సంవత్సరాల తర్వాత అగ్నివీరులు రిటైరయే నాటికి 21.5 నుండి 27 సంవత్సరాల వయసులో ఉంటారు.
ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల సగటు వయసు కంటే తక్కువ వయసులోనే వీరు నిరుద్యోగులుగా మారతారు. సాయుధ శిక్షణ పొంది చిన్న వయసులో నిరుద్యోగులుగా మారటంతో వీరు గూండాలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా, మతోన్మాద శక్తుల చేతిలో పావులుగా మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది సామాజికంగా వినాశకర ఫలితాలకు దారి తీస్తుంది. మరోవైపు సైనిక దళాలను కూడా ఇది బలహీనపరుస్తుంది. సైనిక దళాలలో స్థిరమైన సైనికులు లేకపోవటంతో శత్రువులు చేసే దాడులను ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది.
అనుభవ రాహిత్యం వెంటాడుతుంటుంది. సైనికుల రిక్రూట్‌మెంట్‌లో ఈ మార్పుకు నిధులను ఆదా చేయటం కోసమని చెబుతున్నారు కాబట్టి అదే సాకుతో రిక్రూట్ మెంట్ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లకు అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఆ విధంగా ప్రైవేటీకరణ విధానాల వలన అన్ని రంగాల వలెనే రక్షణ రంగం కూడా వారి చేతులలోకి పోతుంది. అపుడు శత్రువుల నుండి దాడి ప్రమాదం ఎదురైనపుడు దేశాన్ని రక్షించాలా, భక్షించాలా అనేది కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడుతుంది. తమకు లాభాలు వస్తుంటే దేశాన్ని శత్రువులకు అప్పగించటానికి కార్పొరేట్ సంస్థలు ఏ మాత్రమూ సందేహించవు.
దేశభక్తిని గురించి గగ్గోలుపెడుతూ, తమను వ్యతిరేకించే వారంతా దేశద్రోహులని ప్రచారం చేస్తున్న బిజెపి, సంఘ్ పరివార్‌లు తమ విధానమైన హిందుత్వను ముందుకు తీసుకుపోవటానికి, దేశాన్ని శత్రువులకు అప్పగించటానికైనా వెనుకాడవని ఇవి స్పష్టం చేస్తున్నాయి. చిరుత పులి తన మచ్చలను దాచుకోలేనట్లే, ఆర్‌ఎస్‌ఎస్ నిజ స్వరూపం కూడా ఎక్కువ కాలం దాగదని, దాని నిజ స్వరూపం ఏమిటో ప్రజల ముందు బట్టబయలయ్యే కాలం సమీపిస్తున్నదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.