విడుదల చేసిన ఆర్మీ వచ్చే నెల నుంచి దరఖాస్తుల ప్రక్రియ
అంతా ఆన్‌లైన్‌లోనే పింఛన్‌లు ఉండవు.. కార్పస్ ఫండే
న్యూఢిల్లీ :దేశంలో అగ్నిపథ్ పథకం ద్వారా సైనిక ఉద్యోగా ల నియామకాల ప్రక్రియ సోమవారం అధికారికంగా ఆరం భం అయింది. త్రివిధ సైనిక బలగాలలో ఒక్కటైన సైన్యం (పదాతిదళం) సోమవారం రిక్రూట్‌మెంట్ల కోసం నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో సాగుతుందని తెలిపింది. ఆర్మీకి చెందిన వెబ్‌సైట్‌లో ఉద్యోగార్థులు అంటే అగ్నివీరులుగా చేరాలనుకునేవారు తమ పేర్లను కేవలం ఆన్‌లైన్ ద్వారానే నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి అని పేర్కొంది. వచ్చే నెలలో (జులై) ఈ ఆన్‌లైన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్లు ఉంటాయి. సైన్యంలో ఇప్పుడున్న ర్యాంక్‌లకు అగ్నివీర్ల ర్యాంక్‌లకు తేడా ఉంటుంది. భారతీయ సై న్య లో అగ్నివీరులకు నిర్థిష్ట ర్యాంక్‌ను కల్పిస్తారని ఇప్పుడు వెలువరించిన నోటిఫికేషన్‌లో తెలిపారు. అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీసు కాలం ఉంటుంది. ఈ దశలో వారు ఎట్టి పరిస్థితుల్లో నూ తాము తమ విధి నిర్వహణ దశలో తమ దృష్టికి వచ్చే ఎ టు వంటి రహస్య సమాచారం అయినా ఇతరులకు వెల్లడించరాదనే నిషేధం ఉంటుందని తెలిపారు. 1923 అధికారిక రహస్య చట్టాల పరిధిలో ఈ నిబంధనను అగ్నివీరులకు వర్తింపచేస్తారు. అగ్నివీరుల శిక్షణ దశ పూర్తి తరువాత సాం కేతిక, వైద్య విభాగాలు కాకుండా మిగిలిన వాటిలో ఇండియన్ ఆర్మీలోకి రెగ్యులర్ కేడర్‌లోకి తీసుకుంటారు.
అప్పుడు వారిని సైనిక హోదాలలో నమోదు ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా అగ్నివీరులుగా నమోదు చేసుకున్న వారు శిక్షణకాలం పూర్తికి ముందు బయటకు వెళ్లడానికి వీల్లేదు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితులు ఉంటే, ఆ వివరాలు తెలియచేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతిని ఇస్తే ముందుగా ఈ స్కీం నుంచి వెనకకు వెళ్లేందుకు వీలుంటుంది. దేశంలో వివిధ సైనిక విభాగాల్లో యువశక్తిని మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలనే సంకల్పంతో అగ్నిపథ్ స్కీంను ఈ నెల 14వ తేదీన ప్రకటించారు. 17 సంవత్సరాలన్నర నుంచి 23 ఏండ్ల లోపు వారికి అగ్నివీరులుగా రిక్రూట్‌మెంట్ అవకాశాలను కల్పిస్తారని తెలిపారు.
వీరి పదవీకాలం నాలుగేళ్లు . ఇక అగ్నివీరులుగా తీసుకునేవారిలో పాతిక శాతం వరకూ సైన్యంలో తదుపరి కాలం కూడా కొనసాగుతారు. అదనంగా వారికి 15 ఏండ్ల సర్వీసు ఉంటుంది. ఈ విధంగా అగ్నివీరుల ముద్రతో ఉండే సైనికులు మొత్తం మీద 19 ఏండ్ల సర్వీసును కలిగి ఉంటారని సైన్యం తెలిపింది.
1950 సైనిక చట్టం వర్తింపు ఈ పరిధిలోనే కట్టుబాట్లు
అగ్నివీరులుగా రిక్రూట్ అయ్యే యువతకు 1950 ఆర్మీ యాక్ట్ వర్తిస్తుంది. వారు విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల పరిధిలో భూ జల వాయు మార్గాలలో ఎక్కడైనా అవసరాన్ని బట్టి విధి నిర్వహణకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
అగ్నివీరులకు వేతనాలు అలవెన్స్‌లు ఇతర ప్రయోజనాల వివరాలు
నాలుగు సంవత్సరాల సర్వీసు కాలంలో మొదటి సంవత్సరం మొత్తం మీద వేతన ప్యాకేజ్ రూ 30000 (వ ర్తించే అలవెన్స్‌లు అదనం), రెండో సంవత్సరం వేతన ప్యాకేజ్ రూ 33,000 (అలవెన్స్‌లు అదనం), 3వ సంవత్సరం వేతన ప్యాకేజ్ రూ 36,500 (అలవెన్స్‌లు ఉంటా యి), 4వ ఏడాది వేతన ప్యాకేజ్ రూ 40,000 (అలవెన్స్‌లు వర్తిస్తాయి) ప్యాకేజ్‌ల నుంచి 30 శాతం నెలవారిగా తప్పనిసరిగా కార్పస్ ఫండ్‌లో జతచేస్తారు. ఇంతేమొత్తం భారత ప్రభుత్వం(జిఒఐ) జమచేస్తుంది.
యూనిఫారంలపై ప్రత్యేక గుర్తింపుగా అగ్నివీరుల లోగో
అగ్నివీరులు అయ్యే వారి సైనిక యూనిఫాంలపై విశిష్ట రీతిలో ఉండే లోగోలు ఉంటాయి. అగ్నివీరులనే ముద్ర ఉంటుంది. సర్వీసు దశ అంతా ఉండే ఈ లోగో ఇతర వివరాలను తరువాత తెలియచేస్తారు. 18 సంవత్సరాల లోబడి ఉండే వారు నమోదు ప్రక్రియ ఫారంపై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకం పొందుపర్చాల్సి ఉంటుంది.
ఏడాదికి 30 రోజుల సెలవులు
అగ్నివీరులుగా ఎంపికయిన వారికి ఏడాది కాలానికి మొత్తం 30 రోజుల సెలవులు ఉంటాయి, ఈ మేరకు వాటిని వినియోగించుకోవచ్చు. రెగ్యులర్ సర్వీసుల్లోని సైనికులకు ఈ లీవు ఇప్పుడు 90 రోజుల వరకూ అంటే మూడు నెలల వరకూ ఉంటుంది. ఇక వైద్య చికిత్సలు, డాక్టర్ల సిఫార్సులు ఉంటే అగ్నివీరులకు తగు విధంగా మెడికల్ లీవు ఇచ్చేందుకు వీలుంటుంది.
అగ్నివీరులకు వెబ్‌సైట్ ఇదే
అగ్నివీరులుగా నమోదు చేసుకోవాలనుకునేవారు జాయిన్‌ఇండియన్‌ఆర్మీ. ఎన్‌ఐసి. ఐఎన్ లాగిన్ కావల్సి ఉం టుంది. అయితే ఇది జులై నుంచి తెరుచుకుంటుంది. సంబంధిత ఎఆర్‌ఒల పరిధిలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్స్ కీపర్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు ఉంటా యి. అగ్నివీరులకు గరిష్ట విద్యార్హత పదవ తరగతి పాస్, కనీస విద్యార్హత 8వ తరగతి అని ఖరారు చేశారు.
సేవానిధి ప్యాకేజ్
అగ్నివీరులుగా అర్హతలు దక్కించుకున్న వారు 4 ఏండ్ల సర్వీసు తరువాత వారికి వారి కార్పస్ మొత్తం రూ 5.02 లక్షలు ఇంతే మొత్తం భారత ప్రభుత్వం నుంచి కలిపి అందిస్తారు. ఈ విధంగా అగ్నివీరుల తరువాత వారికి మొత్తం మీద రూ 10. 04 లక్షలు , వడ్డీతో కలిపి అందుతుంది. అగ్నివీరుల సర్వీసు దశకు ముందే వెళ్లిపోయే వారికి వారు అంతవరకూ జమచేసిన మొత్తం అందుతుంది. జిఒఐ నుంచి రావల్సింది అందదు. అగ్నివీరుల వేతన ప్యాకేజీ ప్యాకేజీగా ఉంటుంది తప్ప వీరికి ఎటువంటి డిఎలు వర్తింపబోవు. అదే విధంగా మిలిటరీ సర్వీ సు పే ఉండదు. అయితే ప్రమాదాలు, కడగండ్లు వంటి వాటికి సాయం అందుతుంది. వారికి రేషన్, దుస్తులు, ప్రయాణ అలవెన్స్‌లు ఉంటాయి. ఆర్మీలో అమలులో ఉన్న పిఎఫ్ ఇతరత్రా ఫండ్స్‌లో ఎటువంటి మొత్తం జమచేయడానికి వీల్లేదు. అదే విధంగా అగ్నివీరులకు గ్రాట్యుటీలు పెన్షన్ ప్రయోజనాలు ఏమీ కల్పించడం జరగదు. అయితే వారికి జీవిత బీమాను నాన్ కాంట్రిబ్యూటరీ బీ మాగా పొందురుస్తారు. ఇది రూ 48 లక్షలుగా ఉం టుం ది. అయితే ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఎజిఐఎఫ్) స్కీంలు లేదా ప్రయోజనాలు వారికి వర్తించడంజరగదు.
అగ్నివీరులకు వివిధ స్ధాయిలలో విద్యార్హతలు, వయస్సు అర్హతలు
అగ్నివీరులు అన్ని విభాగాలలో జనరల్ డ్యూటీలలో పనిచేయాలనుకునే వారికి విద్యార్హత క్లాస్ 10, సగటు మార్కులు 45 శాతం , ఇక ప్రతిసబ్జెక్టు వారిగా కనీసం 33 శాతం వరకూ మార్కులు ఉండాలి. వీరికి వయోపరిమితి 17 నుంచి 23 సంవత్సరాలు. ఇక అగ్నివీరులు టెక్నికల్ రంగానికి ఇంటర్మీడియెట్ అర్హత సైన్స్ గ్రూప్ అయ్యి ఉండాలి . 50 శాతం మార్కులు , సబ్జెక్టుల వారిగా 40 శాతం మార్కులు ఉండాలి. వయస్సు 17 నుంచి 23 వరకూ . అగ్నివీరులు క్లరికల్ విభాగానికి ఇంటర్మీడియట్ , ట్రేడ్స్‌మెన్లకు క్లాస్ 10 సాధారణ ఉత్తీర్ణత , ఇందులోనే మరో విభాగానికి కనీస విద్యార్హత ఎనిమిదవ తరగతి.
నేడు ప్రధానితో త్రివిధ దళాధిపతుల భేటీ
న్యూఢిల్లీ : ఈనెల 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర నిరసనలు వ్యాపించిన నేపథ్యంలో నియామకాలపై సమీక్షించడానికి మంగళవారం త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. అగ్నిపథ్‌పై ఆందోళనలు తీవ్రమైన పరిస్థితుల్లో సదుద్దేశంతో అమలు చేస్తున్న మంచి పథకాలకు రాజకీయ రంగుల్లో చిక్కుకుంటున్నాయని ఆదివారం మోడీ ఆవేదన చెందిన విషయం తెలిసిందే. తరువాత బెంగళూరులో కూడా ప్రధాని మోడీ ఇదే విధంగా బాధపడ్డారు. కాంగ్రెస్‌తోసహా అనేక పార్టీలు ప్రభుత్వం చేసిన తాజా పొరపాటు అగ్నిపథ్‌గా వ్యాఖ్యానించాయి