న్యూఢిల్లీ : కొత్త తరం అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్నిప్రైమ్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్నిశ్రేణి క్షిపణుల్లో ఒకటైన దీనిని ఒడిశా తీరం లోని బాలాసోర్ వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) ఈ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రయోగంలో అగ్నిప్రైమ్ నిర్ణయించిన లక్షాలన్నిటినీ ఛేదించినట్టు అధికారులు గురువారం ప్రకటించారు. మూడుసార్లు విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించిన తరువాత దళాల్లోకి ప్రవేవ పెట్టే ముందు తొలిసారి అగ్నిప్రైమ్‌ను రాత్రి సమయంలో పరీక్షించడం విశేషం. రాడార్ టెలిమెట్రీ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి వాటిని విభిన్న లొకేషన్లలో అమర్చి దీన్ని ప్రయోగించారు.
సాయుధ దళాల్లో దీన్ని ప్రవేశ పెట్టడానికి మార్గం సుగమమైందని డీఆర్‌డిఒ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను సాయుధ దళాలను అభినందించారు. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. 10001500 కిమీ దూరంలో ఉన్న లక్షాలను సులువుగా ఇది ఛేదిస్తుంది. 1000 కిలోల వరకు అణువార్ హెడ్‌ను మోసుకెళ్ల గలదు. రెండు స్టేజీలు గల ఈ క్షిపణి అగ్ని1 కంటే తేలికగా ఉంటుంది. 4000 కిమీ రేంజ్ కలిగిన అగ్ని4. 5000 కిమీ రేంజ్ కలిగిన అగ్ని5 ఫీచర్లను కూడా అగ్ని ప్రైమ్‌లో అనుసంధానం చేశారు. అగ్ని సీరీస్‌లో ఇది ఆరో క్షిపణి.