ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో అగ్నిప్రైమ్ అనే కొత్తతరం బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లో మోహరించిన అనేక శ్రేణి సెన్సార్ల డేటా ఆధారంగా ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్షాలను పూర్తి చేసిందని రక్షణశాఖ పేర్కొంది. ఈ ప్రయోగాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ , డిఆర్‌డిఒ , ఇండియన్ ఆర్మీ అధికారులు పర్యవేక్షించారు. ఈ అగ్నిప్రైమ్ పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డిఆర్‌డిఒ, ఎస్‌ఎఫ్‌సి, సాయుధ దళాలను అభినందించారు.
ఇది సాయుధ దళాలకు అద్భుతమైన బలాన్ని అందించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలకు వ్యతిరేకంగా భారత్‌కు బలమైన శక్తిని ఇది అందిస్తుందని భావిస్తున్నారు. ఇది కొత్తతరం అణుసామర్థం గల మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని సిరీస్‌లో భాగంగా డిఫెన్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఈ ఆరో క్షిపణి 1000 నుంచి 2000 కిమీ శ్రేణి సామర్థం కలిగినదిగా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. రక్షణ శాఖ ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగమైన ఈ క్షిపణి అగ్ని4, అగ్ని 5 ల సాంకేతిక పురోగతిని కూడా కలిగి ఉందని వివరించింది.